సిక్స్‌ కొట్టి తలపట్టుకున్నాడు.. వీడియో వైరల్‌

24 Jun, 2021 14:55 IST|Sakshi

క్రికెట్‌లో సిక్స్‌ కొడితే బ్యాట్స్‌మన్‌ సెలబ్రేట్‌ చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఇక్కడ మాత్రం ఒక ఆటగాడు భారీ సిక్స్‌ కొట్టిన అనంతరం తల పట్టుకొని గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అదేంటి.. అతను ఎందుకలా చేస్తున్నాడని కాసేపు మైదానంలో ఎవరికి అర్థం కాలేదు. అసలు విషయం తెలిసిన తర్వాత మాత్రం నవ్వాపుకోలేకపోయారు.

విషయంలోకి వెళితే.. క్రాస్‌లీ షీల్డ్‌ క్వార్టర్‌ ఫైనల్లో భాగంగా ఇల్లింగ్‌వర్త్‌ సెంట్‌ మేరీస్‌, షవర్‌బైస్‌ సెంట్‌ పీటర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇల్లింగ్‌వర్త్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఆసిఫ్‌ అలీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇన్నింగ్స్‌ 137/5 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆసిఫ్‌ అలీ భారీ సిక్స్‌తో మెరిశాడు. అయితే సిక్స్‌ కొట్టిన వెంటనే తలకు చేతులు పెట్టుకొని మొకాళ్లపై అలానే కూలబడ్డాడు. పాపం అతని సిక్స్‌ వల్ల ఎవరికైనా దెబ్బ తగిలిందేమోనని భావించి అలా చేశాడని మనం ఊహించేలోపే ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. అతను కొట్టిన సిక్స్‌ ఒక కారు అద్దాలను ధ్వంసం చేసింది. అయితే ఆ కారు ఆసిఫ్‌ అలీదే కావడం విశేషం. దీంతో తన కారు అద్దాలు పగిలిపోయాయని అలీ నిరాశకు లోనవ్వగా.. అంపైర్‌ సహా మిగిలిన ఆటగాళ్లు మాత్రం నవ్వాపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది జరిగి మూడు రోజులవుతున్న వీడియో మాత్రం ట్రెండింగ్‌ లిస్ట్‌లో ఉంది.

ఇక ఈ మ్యాచ్‌లో ఆసిఫ్‌ కారు అద్దాలు పగిలినా  మ్యాచ్‌ విన్నర్‌గా నిలవడం విశేషం. 43 నాటౌట్‌తో చివరి వరకు నిలిచి ఇల్లింగ్‌వర్త్‌కు విజయాన్ని అందించాడు. ఇంతకముందు ఐర్లాండ్‌ స్టార్‌ ఆటగాడు కెవిన్‌ ఓబ్రియాన్‌ కూడా ఇదే తరహాలో భారీ సిక్స్‌ కొట్టి తన కారు అద్దాలను ధ్వంసం చేసుకున్నాడు.  

చదవండి: గ్రౌండ్‌లోనే టవల్‌ చుట్టుకున్న షమీ.. కారణం ఏంటంటే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు