Viral Video: అదృష్టం బాగుంది.. కొంచెమైతే పరువు పోయేదే!

29 May, 2022 17:06 IST|Sakshi

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్‌ టోర్నమెంట్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లంకాషైర్‌, యార్క్‌షైర్‌ మధ్య మ్యాచ్‌లో ఫీల్డర్‌ క్యాచ్‌ అందుకునే క్రమంలో ప్యాంట్‌ జారిపోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యార్క్‌షైర్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు కావాల్సి ఉంది. అయితే మరో రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన దశలో లంకాషైర్‌ బౌలర్‌ హై ఫుల్‌టాస్‌ వేశాడు. క్రీజులో ఉన్న షాదాబ్‌ సిక్స్‌ కొట్టబోయే ప్రయత్నం చేశాడు.

బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచింది. మిడాఫ్‌ నుంచి పరిగెత్తుకొచ్చిన డేన్‌ విలా క్యాచ్‌ అందుకునే ప్రయత్నం చేసినప్పటికి మిస్‌ అయింది. దీంతో బంతిని తీసుకోవడానికి పైకి లేచిన డేన్‌ ప్యాంట్‌ ఒక్కసారిగా కిందకు జారింది. షాక్‌ తిన్న డేన్‌ విలా.. ''ఎవరైనా చూశారేమో..నాకు సిగ్గేస్తుందన్న'' తరహాలో అక్కడే కూలబడ్డాడు. ఆ తర్వాత పైకి లేచి ప్యాంటును సర్దుకొని బంతిని విసిరేశాడు. ఈ వీడియోనూ విటాలిటీ బ్లాస్ట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ''అరె కొంచమైతే పరువు మొత్తం పోయేదే.. క్యాచ్‌ పట్టడం సంగతి దేవుడెరుగు.. ముందు పరువు పోయేది'' అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక లంకాషైర్‌, యార్క్‌షైర్‌ మధ్య మ్యాచ్‌ టైగా ముగిసింది. యార్క్‌షైర్‌కు చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. 12 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్‌ డ్రా అయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంకాషైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఫిలిప్‌ సాల్ట్‌ 41 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇక టి20 బ్లాస్ట్‌ టోర్నమెంట్‌లో యార్క్‌షైర్‌ రెండో స్థానంలో ఉండగా.. లంకాషైర్‌ ఏడో స్థానంలో ఉంది.

చదవండి: Paul Stirling: ఒక్క ఓవర్‌లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే!

మరిన్ని వార్తలు