ICC ODI Rankings: దుమ్మురేపిన మిథాలీ రాజ్‌

29 Jun, 2021 18:53 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ మంగళవారం ప్రకటించిన ఐసీసీ వుమెన్స్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వుమెన్స్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 72 పరుగులతో ఆకట్టుకున్న మిథాలీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ 5లోకి అడుగుపెట్టింది. 725 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకిన ఆమె ఐదో స్థానంలో నిలిచింది. తాజాగా 22 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌ను పూర్తి చేసుకున్న మిథాలీ 38 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్‌తో అదరగొడుతుంది. 2019 తర్వాత మిథాలీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్‌ 5లోకి అడుగుపెట్టడం విశేషం.

 ఇక బ్యాటింగ్‌ విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్ 791 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌వుమన్‌ లిజీ లీ 758 పాయింట్లతో రెండో స్థానంలో, ఆసీస్‌కు చెందిన అలీసా హేలీ 756 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక బౌలింగ్‌ విభాగంలో టీమిండియా నుంచి జులన్‌ గోస్వామి 681 పాయింట్లతో తన ఐదో స్థానాన్ని నిలుపుకోగా.. ఆసీస్‌కు చెందిన జెస్‌ జోనాసన్‌, మేఘన్‌ స్కట్‌ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండ్‌ విభాగంలో టీమిండియా నుంచి దీప్తి శర్మ ఐదో స్థానంలో నిలవగా.. ఎలిస్సే పేరీ(ఆస్ట్రేలియా) తొలి స్థానంలో,మేరీజన్నే కాప్‌(దక్షిణాఫ్రికా), స్టాఫైన్‌ టేలర్‌(వెస్టిండీస్‌) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా తొలి వన్డేలో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 34.5 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు(బుధవారం) జరగనుంది. అంతకముందు ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక డే నైట్‌ టెస్టు మ్యాచ్‌ను టీమిండియా ‍డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ఐసీసీ అధికారిక ప్రకటన: టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఎప్పుడంటే..

ఊహించని విధంగా బౌన్సర్‌ వేశాడు.. దాంతో

మరిన్ని వార్తలు