Mohammed Siraj: మహ్మద్‌ సిరాజ్‌ అభ్యర్థన.. స్పందించిన ఎయిర్‌లైన్స్‌

28 Dec, 2022 21:42 IST|Sakshi

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత సిరాజ్.. విస్తారా విమానంలో ఢాకా నుంచి ముంబయికి చేరుకున్నాడు. కానీ, ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత సిరాజ్ మూడు బ్యాగుల్లో రెండు మాత్రమే వచ్చాయి. ఈ విషయం అక్కడి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వెంటనే తెచ్చిపెడతామని చెప్పారని, కానీ, ఎంతకీ రాలేదన్నాడు. ఈ మేరకు బ్యాగ్‌ మిస్సైందని ట్విట్టర్‌ ద్వారా సదరు ఎయిర్‌లైన్స్‌ సంస్థకు సిరాజ్‌ ఫిర్యాదు చేశాడు.

''నేను 26వ తేదీన వరుసగా UK 182, UK 951 విమానంలో ఢాకా నుంచి ఢిల్లీ మీదుగా ముంబయికి ప్రయాణించాను. నేను మూడు బ్యాగ్‌లతో చెక్ ఇన్ అయ్యాను. వాటిలో ఒకటి మిస్ అయ్యింది. కొద్దిసేపటిలో బ్యాగ్ కనుగొని డెలివరీ చేస్తామని ఎయిర్ లైన్స్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బ్యాగ్‌లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. వీలైనంత త్వరగా బ్యాగ్‌ను హైదరాబాద్‌కు చేరవేయగలరు'' అంటూ ట్వీట్‌ చేశాడు.

సిరాజ్‌ ట్వీట్‌పై స్పందించిన విస్తారా ఎయిర్‌లైన్స్‌.. వివరాలు పంపించాలని కోరింది. సిరాజ్ వివరాలు ఇచ్చాడు. అనంతరం సిబ్బంది తన బ్యాగ్ ఎక్కడుందో గుర్తించారని బుధవారం మరో ట్వీట్ ద్వారా సిరాజ్‌ వెల్లడించాడు. దాన్ని త్వరలోనే తన వద్దకు చేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు