Cricketer Rashid Khan: అఫ్గాన్‌లను చంపడం ఆపండి ప్లీజ్‌.. రషీద్‌ ఖాన్‌ ఉద్వేగం

27 Aug, 2021 15:31 IST|Sakshi

కాబుల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌ మరోసారి రక్తసిక్తమైంది. దేశాన్ని వదిలి వెళ్తున్న పాశ్చాత్యులు, అఫ్గాన్లు లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం సాయంత్రం ఆత్మాహుతి దాడులు జరిగాయి. రెండు బాంబుపేలుళ్లలో 72 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు ఇస్లామిక్‌ స్టేట్‌-ఖోరాసన్‌(ఐసిస్‌-కె) ఉగ్రమూక దుశ్చర్యగా భావిస్తున్నారు. కాబూల్‌ విమానాశ్రయానికి ఉగ్రముప్పు పొంచివుందని, ఆ పరిసరాల్లో ఎవరూ ఉండవద్దని అమెరికా, బ్రిటన్‌ సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బాంబుల మోతతో కాబూల్‌ దద్దరిల్లింది.

ఈ పేలుళ్లపై అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ట్విటర్ వేదికగా కాబుల్‌ మరోసారి రక్తసిక్తమైందని, తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్‌లో నరవధకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నీళ్లు చిందిస్తున్న ఏమోజీలతో పాటు గుండె పగిలిన ఏమోజీలను ట్వీట్‌కు జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. క్రికెట్ అభిమానులు రషీద్‌ను తమ కామెంట్లతో ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాడులకు బాధ్యులను వెంటాడి వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఐసిస్‌ ఉగ్రమూకల కౌంట్‌డౌన్‌ మొదలైందంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు.

ఇదిలా ఉంటే, రషీద్‌ ఖాన్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఆడుతున్నాడు. స్వదేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ తన ఆటపై ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. తనలోకి కసినంతా ప్రత్యర్థి జట్టుపై చూపిస్తున్నాడు. ఇప్పటిదాకా బంతితోనే సత్తా చాటుతూ వచ్చిన అతను.. ఈ మధ్య బ్యాట్‌కు కూడా పనిచెబుతున్నాడు. లీగ్‌లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్‌.. యార్క్‌షైర్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను కొట్టిన హెలికాప్టర్‌ సిక్స్‌ ఇన్నింగ్స్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.
చదవండి: Chris Gayle: గేల్‌ సిక్స్‌ కొడితే మాములుగా ఉంటుందా..

మరిన్ని వార్తలు