-

Afghanistan: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రషీద్‌ ఖాన్‌ భావోద్వేగ ట్వీట్‌

19 Aug, 2021 17:22 IST|Sakshi

లండన్‌: ఆగస్టు 19.. అఫ్గానిస్తాన్‌ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. దేశంలో ముష్కరుల(తాలియన్ల) విధ్వంసకాండ చూసి అతను చలించిపోయాడు. 'ఈరోజు అఫ్గానిస్థాన్‌ స్వాతంత్ర దినోత్సవం. దేశం కోసం మనమందరం కొంత సమయాన్ని కేటాయిద్దాం. దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరవలేము. శాంతియుత అఫ్గాన్‌ రాజ్య స్థాపన కోసం మనమందరం ప్రార్థిద్దాం. ఐక్యరాజ్యసమితి నుంచి సాయం ఆశిస్తున్నాము' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

కాగా, ప్రస్తుతం తాలిబన్ల ఆక్రమణలతో ఉన్న దేశ ప్రజలు ఈసారి వేడుకలకు దూరంగా ఉన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కొందరు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టగా, తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టలేదు. మరోవైపు చాలామంది దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కాబుల్‌ విమానాశ్రయానికి వందల సంఖ్యలో తరలివచ్చారు. అయితే విమానాశ్రయానికి వెళ్లే దారుల్లోనూ పలుచోట్ల తాలిబన్లు ప్రజలను చితకబాదారు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం అఫ్గాన్‌లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ దేశ క్రికెటర్ల భ‌విష్యత్తు గంద‌ర‌గోళంలో ప‌డింది. రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ లాంటి స్టార్‌ క్రికెటర్లైతే ఐపీఎల్‌ తదితర లీగ్‌ల్లో పాల్గొంటామని ఇదివరకే ప్రకటించారు. అయితే, మిగాతా అఫ్గాన్‌ జాతీయ క్రికటర్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌ పాల్గొంటుందా లేదా అన్న అంశంపై సందిగ్దత నెలకొంది. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్లు పాల్గొనేది అనుమానంగా మారింది. 
చదవండి: రూట్‌ను ఔట్‌ చేయాలంటే..? సీక్రెట్‌ను రివీల్‌ చేసిన ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌

మరిన్ని వార్తలు