Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్‌ షమీ ‘భార్య’ అభ్యర్ధన

15 Aug, 2022 13:57 IST|Sakshi

భారత స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' సంబురాలు మిన్నంటిన వేళ.. టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ సోషల్‌మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భర్త షమీతో విభేదాల కారణంగా గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న జహాన్‌.. దేశం పేరు మార్చాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను అభ్యర్ధిస్తూ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

వాడుకలో ఉన్న ఇండియా పేరుతో దేశానికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని, అంచేత దేశం పేరును ఇండియా అని కాకుండా ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని సంబోదించేలా తగు సవరణలు చేపట్టాలని మోదీ, షాలను కోరింది. జహాన్‌ నిన్న (ఆగస్ట్‌ 14) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మన దేశం పేరు ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు నాదొక విజ్ఞప్తి.

ప్రస్తుతం వాడుకలో ఉన్న ‘ఇండియా’ పేరు మార్చి ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని పెట్టండి. వీటితో మనకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుంది..’ అని రాసుకొచ్చింది. వీడియోలో జహాన్‌ మరో ఇద్దరితో కలిసి ప్రముఖ బాలీవుడ్ గీతం ‘దేశ్ రంగీలా’ పాటకు నృత్యం చేస్తూ కనిపిస్తుంది. జహాన్‌ చేసిన ఈ  పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. జహాన్‌ చేసిన ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. దేశం డైమండ్‌ జూబ్లీ స్వాతంత్రోత్సవ సంబురాలు చేసుకుంటున్న వేళ ఈ ప్రతిపాదన రావడం అందరిని ఆకర్షిస్తోంది. కాగా, జహాన్‌.. మహ్మద్‌ షమీపై లైంగిక వేధింపులతో పాటు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేసి కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. 
చదవండి: Independence Day: భారతీయుడినైనందుకు గర్విస్తున్నా.. జై హింద్‌: కోహ్లి

మరిన్ని వార్తలు