చేసిందే తప్పు.. వేలు చూపిస్తూ అసభ్య ప్రవర్తన

28 Mar, 2023 12:46 IST|Sakshi

క్రికెట్‌లో మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ గతేడాది అక్టోబర్‌లోనే ఐసీసీ చట్టం తెచ్చింది. అప్పటినుంచి మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగణిస్తున్నారు. ఇక మన్కడింగ్‌ అంటే బౌలర్‌ బంతిని విడవకముందే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ క్రీజు దాటితే ఔట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధంగా పరిగణించినా ఇప్పుడు మాత్రం రనౌట్‌గా చూస్తున్నారు. అయితే ఒక తస్మానియా క్రికెటర్‌ మాత్రం తాను ఔట్‌ అని తెలిసినా కొంచెం కూడా సహనం లేకుండా క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించి అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. 

విషయంలోకి వెళితే.. ఎస్‌సీఏ(SCA Cricket)లీగ్‌లో క్లార్‌మౌంట్‌, న్యూ నొర్‌ఫోక్‌ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌ సమయంలో బౌలర్‌ బంతిని విడవకముందే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ క్రీజు దాటి ముందుకు వచ్చాడు. ఇది గమనించిన బౌలర్‌ బెయిల్స్‌ను ఎగురగొట్టి మన్కడింగ్‌ చేశాడు. రనౌట్‌ కింద పరిగణించిన అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు. దీంతో కోపంతో పెవిలియన్‌ బాట పట్టిన ‍బ్యాటర్‌ చేతిలోని బ్యాట్‌ను, హెల్మెట్‌ను గాల్లోకి ఎగిరేసి.. చేతికున్న గ్లోవ్స్‌ను కాలితో తన్నాడు. ఆ తర్వాత వేలిని చూపిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్రికెటర్‌ ఆఫ్‌ ది ఫీల్డ్‌ ఏం చేసినా పట్టించుకోరు.. కానీ ఆన్‌ఫీల్డ్‌లో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఈ చర్య అంపైర్‌ సహా ఆటగాళ్లను షాక్‌కు గురిచేసింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత సదరు క్రికెటర్‌పై మ్యాచ్‌ రిఫరీ చర్య తీసుకున్నారు. ఆన్‌ఫీల్డ్‌ అబ్రస్టకింగ్‌ చేసినందుకు జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ నిషేధం విధించినట్లు తెలిసింది. 

చదవండి: బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ

మరిన్ని వార్తలు