ఆ కాల్‌ వస్తుందని ఊహించలేదు.. 

12 Oct, 2020 08:55 IST|Sakshi

సన్‌రైజర్స్‌ జట్టుకు పృథ్వీరాజ్‌ ఎంపిక 

భువనేశ్వర్‌ స్థానంలో అవకాశం 

క్రికెట్‌ కిక్‌.. ఐపీఎల్‌ ఉత్కంఠ కొనసాగుతోంది. జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రత్యేక్షంగా చాలా మంది ప్రత్యేక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది. అయినా పిల్లల నుంచి పెద్దల వరకు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ టోర్నీలో కుర్రోళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఆంధ్రా కుర్రోడు పృథ్వీరాజ్‌కి  సన్‌రైజర్స్‌ జట్లులో ఆడే అదృష్టం దక్కింది. 

సాక్షి, తెనాలి: యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌–2020లో పేసర్‌ భువనేశ్వర్‌ స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఎంపికైన యర్రా పృథ్వీరాజ్‌ తెనాలి కుర్రోడు. తొడ కండరాల గాయంతో భువనేశ్వర్‌ ప్రసాద్‌ ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించగా, అతడి స్థానంలో 22 ఏళ్ల ఎడమచేతి వాటం పేస్‌ బౌలర్‌ పృథ్వీరాజ్‌కు అవకాశం లభించింది. గతేడాది ఐపీఎల్‌కు ఆడిన అనుభవం, ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్న అతడిని భువికి సరైన ప్రత్యామ్నాయంగా జట్టు భావించింది. కరోనా కారణంగా జట్టుతో పాటే ‘బయో సెక్యూర్‌ ఎన్విరాన్‌మెంట్‌’ (బయో బబుల్‌)లో ఉంటున్నందున క్వారంటైన్‌తో పని లేకుండానే పృథ్వీరాజ్‌ జట్టులో ఆడనున్నాడు. చదవండి: (భువీ స్థానంలో పృథ్వీ రాజ్‌ యర్రా)

ఎడమ చేతివాటం పేసర్‌గా.. 
దక్షిణ భారతదేశం నుంచి ఏకైక ఎడమ చేతివాటం ఫాస్ట్‌ బౌలర్‌ అయిన పృథ్వీరాజ్‌ స్వస్థలం తెనాలి సమీపంలోని దుగ్గిరాల. తల్లి జంపాల కృష్ణకుమారి. విశాఖపట్టణంలో ఏపీ ఈడీపీసీఎల్‌లో జూనియర్‌ అకౌంట్స్‌ అధికారిగా చేస్తున్నారు. తండ్రి యర్రా శ్రీనివాసరావు సివిల్‌ ఇంజినీరు/ ప్రభుత్వ కాంట్రాక్టరు. తల్లి ఉద్యోగం కారణంగా విశాఖలో పెరిగిన పృథ్వీరాజ్‌ ప్రస్తుతం బీటెక్‌ చదువుతున్నాడు. తండ్రికి కజిన్‌ అయిన ఆంధ్రా యూనివర్సిటీ హెచ్‌ఓడీ, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.విజయమోహన్‌ తొలి గురువుగా క్రికెట్‌ సాధన చేశాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి అండర్‌–14 నుంచి ఆంధ్రా జట్టుకు వివిధ వయసు విభాగాల్లో ఆడుతూ వచ్చాడు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్కూల్స్‌ జాతీయ పోటీలకు ఆడిన జట్టును కెప్టెన్‌గా నడిపించాడు. 

19 ఏళ్లకే రంజీ ట్రోఫీకి.. 
2017 అక్టోబరులో 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. చిదంబరం స్టేడియంలో తమిళనాడుతో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై మరో ఆరు వికెట్లు తీశాడు. 2018 జూలైలో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ నిర్వహించిన స్పెషలిస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్స్‌ క్యాంప్‌కు దేశవ్యాప్తంగా ఏడుగురు ఎంపిక కాగా, అందులో పృథ్వీరాజ్‌ ఒకరు. శిక్షణ అనంతరం ప్రతిష్టాత్మకమైన దులీప్‌ ట్రోఫీలో ఇండియా రెడ్‌ టీమ్‌కు ఆడాడు. అదే ఏడాది బీసీసీఐ విజయ్‌ హజారే ట్రోఫీకి నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కి ఆడాడు.  

ఐపీఎల్‌కు.. 
ఆ క్రమంలోనే పృథ్వీరాజ్‌ ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. గతేడాది ఐపీఎల్‌ వేలంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసినా, తుది 11 మంది జట్టులో స్థానం కల్పించలేదు. హైదరాబాద్‌ మ్యాచ్‌లో జట్టులో బెర్త్‌ దక్కటంతో, అదే మ్యాచ్‌లో మెయిడన్‌ వికెట్‌గా వార్నర్‌ను బౌల్డ్‌ చేసి వార్తల్లో నిలిచాడు. అంతకుముందు మూలపాడులో నిర్వహించిన బీసీసీఐ సయ్యద్‌ ముస్తాఫ్‌ ఆలీ టీ20 టోర్నమెంటులో జార్ఖండ్‌పై నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మొత్తం ఇప్పటి వరకు 11 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 39 వికెట్లు తీశాడు. టోర్నీ ఆసాంతం 140–150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేయటం, రెండువైపులా స్వింగ్‌ చేయటం, మెరుపుల్లాంటి బౌన్సర్లు వేయగల నేర్పు పృథ్వీరాజ్‌కు ఉన్నాయి. ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ ఆ కాల్‌ వస్తోందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశాడు. ఆ ప్రతిభతోనే టీమిండియా ప్రాతినిధ్యం వహించి ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలవాలన్నది అతడి లక్ష్యమని తండ్రి శ్రీనివాసరావు ‘సాక్షి’కి ఫోనులో చెప్పారు.

మరిన్ని వార్తలు