క్రీడల చరిత్రలో క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లు ఆడిన ఆసీస్‌ ప్లేయర్‌ ఎవరో తెలుసా..?

21 Nov, 2022 15:37 IST|Sakshi

ప్రపంచ క్రీడల చరిత్రలో అత్యంత అరుదైన ఘటన ఒకటి ఉంది. ఓ అంతర్జాతీయ ప్లేయర్‌.. క్రికెట్‌ వరల్డ్‌కప్‌తో పాటు ఫిఫా ప్రపంచకప్‌లో కూడా పాల్గొని, విశ్వంలో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ క్రీడల చరిత్రలో టార్చ్‌లైట్‌ వేసి వెతికినా ఇలాంటి ఓ ఘటన నమోదైన దాఖలాలు లేవు.

ఆస్ట్రేలియాకు చెందిన 32 ఏళ్ల మహిళా క్రికెటర్‌ ఎల్లైస్‌ పెర్రీ 16 ఏళ్ల వయసులోనే (2007) అంతర్జాతీయ క్రికెట్‌ టీమ్‌తో పాటు ఫుట్‌బాల్‌ జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. అటు ఐసీసీ మహిళల వరల్డ్‌కప్‌ (2009)తో పాటు 2011 ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో కూడా పాల్గొంది. పెర్రీ.. ఓ పక్క క్రికెట్‌లో సంచనాలు నమోదు చేస్తూనే, ఫుట్‌బాల్‌లోనూ సత్తా చాటింది.

ఆల్‌రౌండర్‌గా వరల్డ్‌కప్‌లో నేటికీ బద్ధలు కాని ఎన్నో రికార్డులు నమోదు చేసిన పెర్రీ.. ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండర్‌గా ఉంటూనే గోల్స్‌ సాధించింది. 2011 ఫిఫా ప్రపంచకప్‌లో స్వీడన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పెర్రీ.. మెరుపు వేగంతో సాధించిన గోల్‌ను ఆసీస్‌ ఫుట్‌బాల్‌ ప్రేమికులు ఎన్నటికీ మర్చిపోలేరు. అయితే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని క్లబ్‌లు క్రికెట్‌ కావాలో, ఫుట్‌బాల్‌ కావాలో తేల్చుకోమని చెప్పడంతో 2014లో ఫుట్‌బాల్‌కు స్వస్తి పలికి నేటికీ ఆసీస్‌ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది.

క్లబ్‌ లెవెల్ ఫుట్‌బాల్‌లో ఎన్నో అద్భుతాలు చేసిన పెర్రీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతకుమించిన ఎన్నో చెరగని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. అటు క్రికెట్‌లోనూ.. ఇటు ఫుట్‌బాల్‌లోనూ సత్తా చాటిన పెర్రీ ఎందరో మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమెను దేశంలోని అన్ని అత్యుత్తమ పురస్కారాలతో సత్కరించింది.

క్రికెట్‌లో ఆసీస్‌ తరఫున టెస్ట్‌ల్లో 10 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 75.20 సగటుతో 752 పరుగులు చేసింది. ఇందులో 2 శతకాలు 3 అర్ధశతకాలు ఉన్నాయి. ఆమె అత్యుత్తమ స్కోర్‌ 213 నాటౌట్‌గా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆమె 37 వికెట్లు కూడా సాధించింది. 128 వన్డేలు ఆడిన పెర్రీ.. 50.28 సగటున 2 సెంచరీలు, 29 హాఫ్‌ సెంచరీల సాయంతో 3369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టింది. ఇక, 126 టీ20లు ఆడిన పెర్రీ.. 4 హాఫ్‌ సెంచరీల సాయంతో 1253 చేసి 115 వికెట్లు పడగొట్టింది. ఇక ఫుట్‌బాల్‌ విషయానికొస్తే.. ఆసీస్‌ తరఫున 18 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 3 గోల్స్‌ సాధించింది. అలాగే క్లబ్‌ స్థాయిలో 50కి పైగా మ్యాచ్‌ల్లో పాల్గొంది.

విండీస్‌ దిగ్గజం కూడా ఫిఫా వరల్డ్‌కప్‌, క్రికెట్‌ ప్రపంచకప్‌ ఆడాడు.. అయితే..!
పురుషుల క్రికెట్‌లో విండీస్‌ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్ కూడా ఫిఫా వరల్డ్‌కప్‌, క్రికెట్‌ ప్రపంచకప్‌లలో ఆడాడు. 70, 80 దశకాలలో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రిచర్డ్స్..  1975, (తొలి వన్డే ప్రపంచకప్), 1979, 1983 వన్డే ప్రపంచకప్‌లలో పాటు 1974 ఫిఫా వరల్డ్‌కప్‌లో కూడా పాల్గొన్నాడు. కరీబియన్ దీవుల్లోని అంటిగ్వా తరఫున ఫిఫా వరల్డ్‌కప్‌ బరిలోకి దిగిన సర్‌ రిచర్డ్స్‌.. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. నాటి పోటీల్లో ఆంటిగ్వా ఆశించిన స్థాయిలో రాణించలేక, వరల్డ్‌కప్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించలేకపోయింది. 

మరిన్ని వార్తలు