పాడు వైరస్‌.. తాతను తీసుకెళ్లిపోయింది: క్రికెటర్‌ భావోద్వేగం

20 May, 2021 19:22 IST|Sakshi

చెన్నై: టీమిండియా టెస్టు ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అభినవ్‌ ముకుంద్‌ తాత టీ. సుబ్బారావు(95) కరోనాతో పోరాడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అభినవ్‌ ముకుంద్‌ తన ట్విటర్లో పేర్కొన్నాడు. 

''ఈరోజు నా జీవితంలో చీకటిరోజు. నాకు ఎంతో ఇష్టమైన మా తాత టీ. సుబ్బారావు ఈరోజు కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. 95 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న మా తాతను పాడు వైరస్‌ మా తాతను తీసుకెళ్లిపోయింది. ఆయన మాతో ఉన్నన్నాళ్లు అందరం క్రమశిక్షణతో మెలిగేవాళ్లం.. నేడు భౌతికంగా దూరమయ్యారంటే తట్టుకోలేకపోతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ఓం శాంతి అంటూ భావోద్వేగంతో తెలిపాడు. కాగా కరోనా సెకండ్‌వేవ్‌లో చాలా మంది క్రికెటర్లు తమ ఆప్తులను కోల్పోతున్నారు. పియూష్‌ చావ్లా, ఆర్‌పీ సింగ్‌ తండ్రులు కరోనాతో మృతి చెందగా.. టీమిండియా మహిళా క్రికెటర్ల వేదా కృష్ణమూర్తి తన సోదరిని, తల్లిని కోల్పోగా.. మరో క్రికెటర్‌ ప్రియా పూనియా తల్లి కరోనా కాటుకు బలయ్యారు. 

ఇక తమిళనాడుకు చెందిన అభినవ్‌ ముకుంద్‌ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున ఏడు టెస్టలాడిన ముకుంద్‌ 320 పరుగులు చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన ముకుంద్‌ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. నాలుగేళ్ల క్రితమే టీమిండియాకు దూరమైన అభినవ్‌ దేశవాలీ టోర్నీలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 145 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 10వేలకు పైగా పరుగులు సాధించాడు. 2008లో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 300 పరుగులు సాధించి తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. 
చదవండి: కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్‌

టీమిండియా మహిళా క్రికెటర్‌ ఇంట్లో విషాదం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు