Ronaldo: ఐస్‌బాత్‌లో రొనాల్డొ చిందులు.. ధర 50వేల యూరోలు

9 Oct, 2021 20:25 IST|Sakshi

Cristiano Ronaldo... క్రిస్టియానో రొనాల్డొ.. ఫుట్‌బాల్‌లో ఈ పేరుకున్న క్రేజ్‌ వేరు. 36 ఏళ్ల వయసులోనూ మంచి ఫిజిక్‌ మెయింటెన్‌ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. మైదానంలో బరిలోకి దిగాడంటే పాదరసంలా కదులుతూ గోల్స్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు.  తాజాగా ఈ పోర్చుగల్‌ స్టార్‌ 50వేల యూరోల విలువ(ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ.51 లక్షలు) కలిగిన ఐస్‌బాత్‌ టబ్‌లో చిందులు వేయడం వైరల్‌గా మారింది. ఒక ఐస్‌బాత్‌ టబ్‌కు ఇంత ధర అని మాత్రం ఆశ్చర్యపోకండి. రొనాల్డొ 36 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా కనిపించడానికి ఈ ఐస్‌బాత్‌ టబ్‌ ఒక కారణమట.

చదవండి: Cristiano Ronaldo: రొనాల్డొ ఘనత.. 13 ఏళ్ల తర్వాత 


ప్రఖ్యాత పత్రిక ది సన్ నివేదిక ప్రకారం.. తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి క్రియోథెరఫీ చాంబర్‌ను ఏర్పాటు చేసిన ఐస్‌బాత్‌ టబ్‌ను రొనాల్డొ ఇటలీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నాడు. 50 వేల యూరోల విలువ కలిగిన ఈ ఐస్‌బాత్‌ స్పెషాలిటీ ఏంటంటే.. మానవ కణజాలం చికిత్స , పునరుద్ధరణకు సహాయపడటానికి -200C కంటే తక్కువ ఉష్ణోగ్రతను వర్తింపజేస్తుంది. కాగా ఐస్‌బాత్‌లో దిగాలంటే బేస్‌బాల్‌ ఆటలో ఉపయోగించే మిట్స్‌ ఆకారంలో ఉ‍న్న దానిని ధరించాలి.

ఆ తర్వాత క్రియో థెరఫీ చాంబర్‌లోకి లిక్విడ్‌ నైట్రోజన్‌ను పంపుతారు. ఆ లిక్విడ్‌  వ్యక్తి యొక్క శరీరాన్ని మొత్తం 3 నిమిషాల్లో కూల్‌ చేసేస్తుంది. ఈ సమయంలో శరీరం మొత్తం హాయిగా ఉంటూ మరింత ఫిట్‌నెస్‌ వచ్చేలా చేస్తుంది. ఈ చాంబర్‌లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉంటే ప్రమాదమని కొందరు హెచ్చరిస్తే..  మరికొందరు మాత్రం ఈ ఐస్‌బాత్‌ ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణను పెంచడంతో పాటురోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా రొనాల్డొ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవడం కోసం అంత ధర కలిగిన ఐస్‌బాత్‌లో చిందులు వేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే జూవెంటస్‌ నుంచి మాంచెస్టర్‌ యునైటెడ్‌కు మారిన రొనాల్డొ తాజాగా ప్రీమియర్‌ లీగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు.

చదవండి: Lionel Messi: స్టార్‌ ఫుట్‌బాలర్‌కు చేదు అనుభవం.. హోటల్‌ గదిలోకి చొరబడి..!

మరిన్ని వార్తలు