Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌ స్టార్‌ రొనాల్డోకు పోలీసుల వార్నింగ్‌.. 

19 Aug, 2022 11:40 IST|Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు చేదు అనుభవం ఎదురైంది. అభిమానితో దురుసుగా ప్రవర్తించిన కారణంగా పోలీసులు రొనాల్డోను హెచ్చరించారు. విషయంలోకి వెళితే.. గత ఏప్రిల్‌ 9న గూడిసన్‌ పార్క్‌ వేదికగా ఎవర్టన్‌ ఎఫ్‌సీ, మాంచెస్టర్‌ యునైటెడ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గాయపడ్డాడు. మ్యాచ్‌ను కూడా 1-0తో ఎవర్టన్‌ ఎఫ్‌సీ కైవసం చేసుకుంది. దీంతో మ్యాచ్‌ ఓడిపోయామన్న బాధలో పెవిలియన్‌ వెళ్తున్న రొనాల్డోను కొంత మంది తన ఫోన్‌ కెమెరాల్లో బందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎవర్టన్‌ ఎఫ్‌సీ అభిమాని ఒకరు రొనాల్డోను ఫోటో తీయడానికి ప్రయత్నించగా.. చిర్రెత్తికొచ్చిన రొనాల్డో ఆవేశంతో అతని ఫోన్‌ను నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కాసేపటి తర్వాత సదరు వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. ఎంత క్షమాపణ చెప్పినా రొనాల్డో చర్య తప్పిదమే. అందుకే బ్రిటీష్‌ పోలీసులు రొనాల్డో చర్యను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టారు.

తాజాగా బుధవారం రొనాల్డోను హెచ్చరిస్తూ ఒక మెసేజ్‌ పంపారు. 37 ఏళ్ల రొనాల్డో ఉద్దేశపూర్వకంగానే ఒక అభిమానికి సంబంధించిన వస్తువుకు నష్టం కలిగించాడని మా విచారణలో తేలింది. దీనిపై రొనాల్డోను ప్రశ్నించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు  పేర్కొంది. వస్తువును ధ్వంసం చేసి క్రిమినల్‌ డ్యామేజ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు నిజమని తేలడంతో రొనాల్డోకు హెచ్చరికలు జారీ చేసినట్లు బ్రిటీష్‌  పోలీసులు తెలిపారు. 

చదవండి: అథ్లెట్‌ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి... అయినా అద్భుత విజయాలు

Vijender Singh: 19 నెలలు గ్యాప్‌ వచ్చినా.. ఏ మాత్రం తగ్గని జోరు

మరిన్ని వార్తలు