Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్‌ నాది'

29 Nov, 2022 15:31 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్‌ రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గ్రూప్‌-హెచ్‌లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్‌ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఉరుగ్వేతో తలపడింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ 2-0తో గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇక పోర్చుగల్‌ మిడ్‌ ఫీల్డర్‌ బ్రూనో ఫెర్నాండేజ్‌ రెండు గోల్స్‌ చేసి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫెర్నాండేజ్‌ ఆటతీరకు ముగ్దుడైన రొనాల్డో స్వయంగా అభినందించాడు. 

కానీ మ్యాచ్‌లో ఫెర్నాండేజ్‌ కొట్టిన ఒక గోల్‌ విషయమై ఆరోపణలు చేశాడు. ఆట తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఎలాంటి గోల్‌ నమోదు చేయలేకపోయాయి. ఇక రెండో అర్థభాగంలో ఆట 54వ నిమిషంలో రొనాల్డో హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టినట్లు భ్రమపడి సంబరాల్లో మునిగిపోయాడు. అయితే ఆ గోల్‌ చేసింది రొనాల్డో కాదని.. బ్రూనో ఫెర్నాండేజ్‌ అని తర్వాత తెలిసింది.

అసలేం జరిగేందంటే.. వాస్తవానికి రొనాల్డో హెడర్‌ గోల్‌ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు.  అంతకముందే రొనాల్డోకు క్రాస్‌గా వచ్చిన బ్రూనో ఫెర్నాండేజ్‌ షాట్‌తో బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపించాడు.  ఇక బంతి గోల్‌ పోస్ట్‌లోకి వెళ్లడానికి ముందు రొనాల్డోకు ఎక్కడా తగల్లేదని రిప్లేలో తేలింది. దీంతో బ్రూన్‌ ఫెర్నాండేజ్‌ ఖాతాలోకి ఆ గోల్‌ వెళ్లిపోయింది.

అయితే రిఫరీ నిర్ణయంతో షాక్‌ తిన్న రొనాల్డో.. అంతా తొండి.. ఆ గోల్‌ నాది.. అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బ్రూనో ఆట 90+ మూడో నిమిషంలో మరో గోల్‌ చేయడంతో పోర్చుగల్‌ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లడం.. ఆపై విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ​ రొనాల్డో ఖాతాలోకి ఆ గోల్‌ వెళ్లి ఉంటే మాత్రం చరిత్ర సృష్టించేవాడే.. కానీ కొద్దిలో మిస్‌ అయింది.

ఇక ఉరుగ్వేపై విజయంతో ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రి క్వార్టర్స్‌కు చేరిన మూడో జట్టుగా పోర్చుగల్‌ నిలిచింది. కాగా 2018 చాంపియన్స్‌ ఫ్రాన్స్‌తో పాటు ఐదుసార్లు చాంపియన్‌ అయిన బ్రెజిల్‌ కూడా ఇప్పటికే రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించాయి. ఇక పోర్చుగల్‌ తన తర్వాతి మ్యాచ్‌ డిసెంబర్‌ 3న దక్షిణ కొరియాతో ఆడనుంది.

చదవండి: FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్‌ చేసి.. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌

>
మరిన్ని వార్తలు