FIFA WC 2022: పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డోకు అవమానం.. అర్జెంటీనా ఆటగాడు కూడా

20 Dec, 2022 13:52 IST|Sakshi

ఖతర్‌ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌ పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు చేదు అనుభవమే మిగిల్చింది. మెగాటోర్నీ ఆరంభం కాకముందే పియర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ ద్వారా మాంచెస్టర్‌ యునైటెడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టను దిగజార్చకున్నాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ రొనాల్డో ఆశించినంత మేర రాణించలేదనే చెప్పాలి. కేవలం ఒకే ఒక్క గోల్‌ కొట్టిన రొనాల్డో ఆ తర్వాత కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌ల్లో తొలుత బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఫామ్‌లో లేని రొనాల్డో స్థానంలో వేరేవారికి అవకాశం ఇవ్వాలనే అతన్ని బెంచ్‌కు పరిమితం చేసినట్లు పోర్చుగల్‌ హెడ్‌కోచ్‌ ఫెర్నాండో శాంటెజ్‌  వివరించాడు. అయితే రొనాల్డో తుదిజట్లులో లేకపోవడం పోర్చుగల్‌ను దెబ్బకొట్టిందనే చెప్పొచ్చు. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో నెగ్గినప్పటికి.. కీలకమైన క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో చేతిలో ఓడి పోర్చుగల్‌ ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్‌లోనూ రొనాల్డో తొలుత బెంచ్‌కే పరిమితమయ్యాడు. రెండో అ‍ర్థభాగంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు.

ఆ తర్వాత క్రిస్టియానో రొనాల్డో కన్నీటిపర్యంతం అయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అలా రొనాల్డో అవమానభారంతో ఫిఫా వరల్డ్‌కప్‌ను ముగించాడు. 37 ఏళ్ల రొనాల్డో మరో ఫిఫా వరల్డ్‌కప్‌ ఆడేది అనుమానమే. ఈ నేపథ్యంలోనే రొనాల్డోకు మరోసారి అవమానం జరిగింది. ఫిఫా వరల్డ్‌కఫ్‌లో చెత్త ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో సోఫాస్కోర్‌ అనే వెబ్‌సైట్‌ వరస్ట్‌ ఎలెవెన్‌  జట్టును ప్రకటించింది. ఈ జట్టులో క్రిస్టియానో రొనాల్డో చోటు దక్కించుకున్నాడు. ఒకే ఒక్క గోల్‌ చేసిన రొనాల్డోకు సోఫాస్కోర్‌ ఇచ్చిన స్కోర్‌ రేటింగ్‌ 6.46.  

ఇక ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టులో నుంచి కూడా ఒక ఆటగాడికి వరస్ట్‌ ఎలెవెన్‌ టీమ్‌లో చోటు దక్కింది. అతనే ఫార్వర్డ్‌ ప్లేయర్‌ లౌటారో మార్టినెజ్. పైనల్‌ మ్యాచ్‌లో అదనపు సమయంలో జులియన్‌ అల్వరేజ్‌ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్టినేజ్‌ ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయాడు. ఈ వరల్డ్‌కప్‌లో 148 నిమిషాల పాటు యాక్షన్‌లో ఉన్న మార్టినేజ్‌ గోల్‌ కొట్టడంలో.. అసిస్ట్‌ చేయడంలో ఫెయిల్‌ అవ్వడంతో కోచ్‌ లియోనల్‌ స్కలోని అతన్ని రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేశాడు. మార్టినేజ్‌కు 6.35 రేటింగ్‌ ఇచ్చింది.

ఇక వీరిద్దరితో పాటు సెనెగల్‌ స్టార్‌ గోల్‌కీపర్‌ ఎడౌర్డ్‌ మండీ(6.30) రేటింగ్‌ ఇచ్చింది. రౌండ్‌ ఆఫ్‌ 16లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడి సెనెగల్‌ ఇంటిబాట పట్టింది. ఇంకా ఈ జాబితాలో సెర్జినో డెస్ట్‌(అమెరికా, 6.50 రేటింగ్‌), పోలాండ్‌కు చెందిన కమిల్‌ గ్లిక్‌, బార్టోజ్ బెరెస్జిన్స్కిలు ఉన్నారు.  ఆస్ట్రేలియాకు చెందిన జాక్సన్‌ ఇర్విన్‌, మాథ్‌యూ లిక్కీలతో పాటు సౌత్‌ కొరియాకు చెందిన హవాంగ్‌ ఇన్‌ బోయెమ్‌, రూబెన్‌ వర్గస్‌(స్విట్జర్లాండ్‌)లను మిడ్‌ఫీల్డింగ్‌లో చోటు దక్కింది. 

సోఫాస్కోర్‌ ఫిఫా వరల్డ్‌కప్‌ వరస్ట్‌ ఎలెవెన్‌ జట్టు: క్రిస్టియానో రొనాల్డో(కెప్టెన్‌), లౌటారో మార్టినె,  హవాంగ్‌ ఇన్‌ బోయెమ్‌, రూబెన్‌ వర్గస్‌, జాక్సన్‌ ఇర్విన్‌, మాథ్‌యూ లిక్కీ,  ఎడౌర్డ్‌ మండీ(గోల్‌ కీపర్‌), సెర్జినో డెస్ట్‌, కమిల్‌ గ్లిక్‌, బార్టోజ్ బెరెస్జిన్స్కి, అబ్దు డియల్లో

చదవండి: శకం ముగిసింది.. రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ ఫుట్‌బాలర్‌

మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా?

మరిన్ని వార్తలు