Cristiano Ronaldo: కోచ్‌ కాదు.. నోటి ‍మాటలే శాపంగా మారాయా?

12 Dec, 2022 12:50 IST|Sakshi

క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఈ దశాబ్దంలో అత్యున్నత ఆటగాళ్లలో రొనాల్డో ఒకడిగా ఉన్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ రొనాల్డో చేసే విన్యాసాలు అభిమానులను అలరిస్తుంటాయి. పోర్చుగల్‌ తరపున 195 మ్యాచ్‌ల్లో 118 గోల్స్‌ కొట్టిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్‌కప్‌ తీరని కలగా మిగిలిపోయింది.

ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి ఆ కోరికను నెరవేర్చుకోవాలనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. మొరాకో చేతిలో 2-1 తేడాతో ఓడి క్వార్టర్‌లోనే వెనుదిరిగింది. అంతే చిన్న పిల్లాడిలా మారిపోయిన రొనాల్డో వెక్కివెక్కి ఏడ్చాడు. ప్రస్తుతం రొనాల్డో వయస్సు 37 ఏళ్లు. అంటే ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే తప్ప వచ్చే ఫిఫా వరల్డ్‌కప్‌ అతను ఆడడం కష్టమే.

అయితే కీలకమైన క్వార్టర్‌ ఫైనల్లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేయడంపై పోర్చుగల్‌ కోచ్‌ ఫెర్నాండో శాంటోజ్‌ను అందరూ తప్పుబడుతున్నారు. ఫెర్నాండో చేసింది తప్పే కావొచ్చు.. ఎందుకంటే రొనాల్డో ఒక సూపర్‌స్టార్‌. పోర్చుగల్‌ జట్టు ​కెప్టెన్‌గా ఉన్నాడు. కీలక మ్యాచ్‌లో ఒక స్టార్‌ను పక్కనబెడితే ఆ ప్రభావం జట్టుపై బలంగా ఉంటుంది. ఈ విషయంలో శాంటోజ్‌ను తప్పుబట్టడం కరెక్టే. నిజానికి రొనాల్డో ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు. మెగాటోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడిన రొనాల్డో కేవలం ఒక్క గోల్‌కే పరిమితమయ్యాడు.  

రొనాల్డో కొంతమంది అభిమానులు మాత్రం అతని నోటి మాటలే జట్టుకు దూరం చేశాయని.. అదే అతనికి శాపంగా మారిందని పేర్కొనడం ఆసక్తి రేపింది. ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు పియర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్‌ యునైటెడ్‌ కోచ్‌తో గొడవను బయటపెట్టిన రొనాల్డో.. ఆ తర్వాత వారితో జరిగిన అనుభవాలను వరుసగా చెప్పుకొచ్చాడు. ఇవే అతనికి శాపంగా మారాయి.

ఆ తర్వాత మాంచెస్టర్‌ యునైటెడ్‌ రొనాల్డోతో బంధం ముగిసిందంటూ లేఖ విడుదల చేయడం.. అప్పటికి తగ్గని రొనాల్డో విమర్శలు చేస్తూ పోవడం అతనికి నెగిటివిటిని తెచ్చిపెట్టింది. ఒకవైపు తన సమకాలీకుడు అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ.. ఆటలో దూసుకుపోతుంటే.. రొనాల్డో మాత్రం వివాదాలతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పరిస్థితులు అతనికి విలన్‌గా మారాయి.. ఎంతలా అంటే స్విట్జర్లాండ్‌తో కీలకమైన ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేశారు. అప్పుడు కోచ్‌ ఫెర్నాండో శాంటెజ్‌ తన నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. రొనాల్డో పక్కనబెట్టడంపై తానేం బాధపడపడడం లేదని చెప్పుకొచ్చాడు.

తాజాగా మొరాకోతో మ్యాచ్‌లోనూ మొదట రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలి అర్థభాగం ఆటకు దూరంగా ఉన్న రొనాల్డో.. రెండో అర్థభాగంలో వచ్చినప్పటికి పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా మొరాకో చేతిలో ఓడాలని రాసిపెట్టుంటే రొనాల్డో మాత్రం అద్భుతాలు ఏం చేయగలడు. ఏమో రొనాల్డో వ్యాఖ్యలను మనసులో పెట్టుకొని పోర్చుగల్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ కావాలనే అతన్ని కీలక మ్యాచ్‌లో తప్పించిందేమోనన్న అనుమానం కలగక మానదు.

ఇక మొరాకోతో మ్యాచ్‌ ఓటమి అనంతరం రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన సమాధానం రాసుకొచ్చాడు. ''మొరాకోతో మ్యాచ్‌ మాకు ఒక పీడకల. వరల్డ్‌కప్‌ గెలవాలనే డ్రీమ్‌తో ఖతర్‌లో అడుగుపెట్టా. కానీ ఆ కల నెరవేరకుండానే ఇలా పోర్చుగల్‌ వెళ్లిపోతానని ఊహించలేదు. కీలక సమయంలో మొరాకో జట్టు బాగా ఆడింది. వారి డిఫెన్స్‌ పటిష్టంగా ఉంది. కోచ్‌ శాంటోజ్‌తో నాకు ఎలాంటి వివాదాలు లేవు. నా అవసరం జట్టుకు లేదు అన్నప్పుడు పక్కనబెట్టడం నాకు బాధ కలిగించలేదు. అయితే ఫిఫా వరల్డ్‌కప్‌ను తీసుకురావాలన్న దేశ ప్రజల కోరికను నెరవేర్చనందుకు బాధగా ఉంది. థాంక్యూ ఖతర్‌.. ఇక్కడి అభిమానాన్ని ఎప్పటికి మరిచిపోనూ.. థాంక్యూ పోర్చుగల్‌'' అంటూ పేర్కొన్నాడు.

A post shared by Cristiano Ronaldo (@cristiano)

చదవండి: పోర్చుగల్‌ ఓటమిని సెలబ్రేట్‌ చేసుకున్న అడల్ట్‌ స్టార్‌

Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు

మరిన్ని వార్తలు