cristiano Ronaldo: ఎట్టకేలకు గోల్‌.. కనిపించని సెలబ్రేషన్స్‌

4 Feb, 2023 11:26 IST|Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు అల్‌-నసర్‌ తరపున తొలి గోల్‌ కొట్టాడు. అల్‌ ఫతేహ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో తన గోల్‌తో అల్‌-నసర్‌ను ఓటమి నుంచి గట్టెక్కించి మ్యాచ్‌ను డ్రా చేయడంలో సఫలమయ్యాడు. అదనపు సమయంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన రొనాల్డో ఎప్పుడు గోల్‌ కొట్టినా సుయ్‌(Sui) సెలబ్రేషన్‌ చేయడం చూస్తుంటాం. కానీ తొలిసారి ఎలాంటి సెలబ్రేషన్స్‌ లేకుండా రొనాల్డో సాదాసీదాగా కనిపించాడు. బహుశా మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమే అందుకు కారణమనుకుంటా.

కాగా ఫిఫా వరల్డ్‌కప్‌ జరగుతున్న సమయంలోనే మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో.. సౌదీ అరేబియాకు చెందిన అల్‌ నసర్‌ క్లబ్‌తో 200 మిలియన్‌ యూరోలకు రెండున్నరేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాడు. అల్‌ నసర్‌ క్లబ్‌కు వెళ్లినప్పటి నుంచి రొనాల్డో ఒక్క గోల్‌ కూడా కొట్టలేదు. తాజాగా క్లబ్‌ తరపున తొలి గోల్‌ నమోదు చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే అల్‌ ఫతేహ్‌తో మ్యాచ్‌ను అల్‌ నసర్‌ 2-2తో డ్రా చేసుకుంది. ఆట 12వ నిమిషంలో మాజీ బార్సిలోనా స్టార్‌ క్రిస్టియాన్‌ టెల్లో గోల్‌ కొట్టడంతో అల్‌ ఫతేహ్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆట 42వ నిమిషంలో టలిస్కా అల్‌ నసర్‌కు తొలి గోల్‌ అందించి 1-1తో సమం చేశాడు. తొలి హాఫ్‌ను రెండు జట్లు 1-1తో ముగించాయి. రెండో అర్థభాగం మొదలయ్యాకా 58వ నిమిషంలో అల్‌ ఫతేహ్‌ ఆటగాడు సోఫియాఏ బెండెబ్కా గోల్‌ కొట్టి జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

అప్పటి నుంచి నిర్ణీత సమయంలోగా అల్‌ నసన్‌ మరో గోల్‌ కొట్టలేకపోయింది. అయితే అదనపు సమయంలో రొనాల్డోకు లభించిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకొని గోల్‌గా మలచడంతో మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. ఇక 15 మ్యాచ్‌ల తర్వాత అల్‌ నసర్‌ లీగ్‌లో తొలి స్థానంలో నిలిచింది. జట్టు ఖాతాలో 34 పాయింట్లతో ఉంది. ఇక అల్‌ నసర్‌  గురువారం అల్‌ వేదాకు బయలుదేరి వెళ్లింది.

చదవండి: ఎన్‌బీఏ స్టార్‌ క్రేజ్‌ మాములుగా లేదు; ఒక్క టికెట్‌ ధర 75 లక్షలు

మరిన్ని వార్తలు