Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో

10 Feb, 2023 21:10 IST|Sakshi

పోర్చుగ‌ల్ స్టార్ ఫుట్‌బాల‌ర్ క్రిస్టియానో రొనాల్డో మ‌రో ఘ‌న‌త సాధించాడు. ఫుట్‌బాల్‌ క్లబ్స్‌ త‌ర‌ఫున 500 గోల్స్ చేశాడు. సౌదీ ప్రో లీగ్‌లో నాలుగు గోల్స్ కొట్టి ఈ రికార్డుకు చేరువ‌య్యాడు. అల్ వెహ్దాతో గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో రొనాల్డో చెల‌రేగిపోయాడు. మున‌ప‌టి రొనాల్డోను గుర్తు చేస్తూ 30 నిమిషాల వ్యవధిలో బంతిని నాలుగు సార్లు గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, అల్‌-నసర్‌ క్లబ్ 4-0తో గెలుపొందింది. ప్రస్తుతం అత‌ని ఖాతాలో 503 గోల్స్ ఉన్నాయి.

పోర్చుగ‌ల్‌లోని సావో పెడ్రో అనే చిన్న ద్వీపంలో పుట్టిన రొనాల్డో మొద‌ట్లో అండోరిన్హా, న‌సియోన‌ల్ వంటి స్థానిక క్ల‌బ్స్‌కు ఆడాడు. ఆట‌లో నైపుణ్యం సాధించిన అత‌ను 18 ఏళ్లకే సీనియ‌ర్ టీమ్‌కు ఆడాడు. అత‌ను ఇప్పటి వ‌ర‌కు ఐదు క్లబ్స్‌కు ఆడాడు. రియల్ మాడ్రిడ్ త‌ర‌ఫున రొనాల్డో అత్యధికంగా 311 గోల్స్ కొట్టాడు. ఆ తర్వాత మాంచెస్టర్‌ యునైటెడ్ క్లబ్‌ తరపున 103 గోల్స్ చేశాడు. జువెంట‌స్ క్లబ్‌కు ఆడిన స‌మ‌యంలో 81 గోల్స్ చేశాడు. స్పోర్టింగ్ లెబ‌నాన్ క్లబ్‌ త‌ర‌ఫున మూడు, తాజాగా అల్ నసర్‌ క్లబ్‌ తరపున ఐదు గోల్స్ కొట్టాడు. ఓవరాల్‌గా పోర్చుగల్‌ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా అన్ని క్లబ్‌లు కలిపి 1100 మ్యాచ్‌లకు పైగా ఆడిన రొనాల్డో 820 గోల్స్‌ కొట్టాడు.

చదవండి: 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్‌.. ఆటగాడిపై జీవితకాల నిషేధం

ఆసీస్‌ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్‌ తొక్కేశారు

మరిన్ని వార్తలు