పుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు పోర్చుగల్‌

31 Mar, 2022 05:09 IST|Sakshi

లిస్బన్‌: తన కెరీర్‌లో లోటుగా ఉన్న ప్రపంచకప్‌ టైటిల్‌ను సాధించేందుకు పోర్చుగల్‌ కెప్టెన్, విఖ్యాత ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డోకు మరో అవకాశం లభించింది. ఈ ఏడాది నవంబర్‌–డిసెంబర్‌లలో ఖతర్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు పోర్చుగల్‌ జట్టు అర్హత పొందింది. బుధవారం జరిగిన యూరోపియన్‌ జోన్‌ ప్లే ఆఫ్‌ ఫైనల్లో పోర్చుగల్‌ 2–0 గోల్స్‌ తేడాతో నార్త్‌ మెసెడోనియా జట్టును ఓడించి ప్రపంచకప్‌ బెర్త్‌ సొంతం చేసుకుంది.

పోర్చుగల్‌ తరఫున బ్రూనో ఫెర్నాండెజ్‌ (32వ, 65వ ని.లో) రెండు గోల్స్‌ సాధించాడు. రొనాల్డోకిది వరుసగా ఐదో ప్రపంచకప్‌ కానుంది. మరో ప్లే ఆఫ్‌ ఫైనల్లో పోలాండ్‌ 2–0తో స్వీడన్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఆఫ్రికా జోన్‌ నుంచి ఘనా, సెనెగల్, ట్యూనిషియా, మొరాకో, కామెరూన్‌ జట్లు కూడా ప్రపంచకప్‌ బెర్త్‌లు సంపాదించాయి. మొత్తం 32 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు 27 జట్లు అర్హత పొందాయి. జూన్‌ 14న జరిగే ఇంటర్‌ కాంటినెంటల్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల అనంతరం మిగిలిన ఐదు బెర్త్‌లు ఖరారవుతాయి. మిగిలిన ఐదు బెర్త్‌ల కోసం రేసులో ఉన్న జట్లతో కలిపి శుక్రవారం ప్రపంచకప్‌ ‘డ్రా’ను విడుదల చేయనున్నారు.

మరిన్ని వార్తలు