పీలేను దాటిన క్రిస్టియానో రొనాల్డో...

5 Jan, 2021 04:07 IST|Sakshi

758 గోల్స్‌తో రెండో స్థానానికి...

ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్‌ జట్టు కెప్టెన్, యువెంటస్‌ క్లబ్‌ (ఇటలీ) స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో రెండో స్థానానికి చేరుకున్నాడు. 757 గోల్స్‌తో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ దిగ్గజం పీలేను మూడో స్థానానికి నెట్టిన రొనాల్డో 758 గోల్స్‌తో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇటలీ ప్రొఫెషనల్‌ లీగ్‌ సెరియె ‘ఎ’లో భాగంగా ట్యూరిన్‌లో యుడినెస్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యువెంటస్‌ 4–1తో గెలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు 756 గోల్స్‌తో మూడో స్థానంలో ఉన్న రొనాల్డో రెండు గోల్స్‌ చేసి పీలేను దాటి ముందుకెళ్లాడు. రొనాల్డో ప్రొఫెషనల్‌ లీగ్స్‌లో 656 గోల్స్‌... దేశం తరఫున ఆడుతూ 102 గోల్స్‌ చేశాడు. అందుబాటులో ఉన్న అధికారిక లెక్కల ప్రకారం అత్యధిక గోల్స్‌ చేసిన క్రీడాకారుల జాబితాలో 759 గోల్స్‌తో జోసెఫ్‌ బికాన్‌ (చెక్‌ రిపబ్లిక్‌) టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. మరో రెండు గోల్స్‌ చేస్తే రొనాల్డో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా కొత్త రికార్డు లిఖిస్తాడు.

మరిన్ని వార్తలు