FIFA World Cup 2022: క్రొయేషియా కేక

6 Dec, 2022 02:12 IST|Sakshi
జపాన్‌ ఆటగాళ్ల మూడు పెనాల్టీ షాట్‌లను నిలువరించిన క్రొయేషియా గోల్‌కీపర్‌ లివాకోవిచ్‌ 

‘షూటౌట్‌’లో జపాన్‌పై 3–1తో విజయం

మూడోసారి క్వార్టర్‌ ఫైనల్లో చోటు

మూడు షాట్‌లను నిలువరించిన గోల్‌కీపర్‌ లివాకోవిచ్‌

జపాన్‌కు మళ్లీ నిరాశ 

దోహా: లీగ్‌ దశలో రెండు ప్రపంచ మాజీ చాంపియన్‌ జట్లపై (జర్మనీ, స్పెయిన్‌) సంచలన విజయం సాధించిన జపాన్‌ జట్టు కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. గత ప్రపంచకప్‌ రన్నరప్‌ క్రొయేషియా జట్టుతో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌ ‘షూటౌట్‌’లో ఓడిపోయింది. జపాన్‌ను ఏమాత్రం తక్కువ చేయకుండా నిర్ణీత సమయంలో... ఆ తర్వాత అదనపు సమయంలోనూ జాగ్రత్తగా ఆడిన క్రొయేషియా నిర్ణాయక ‘షూటౌట్‌’లో మాత్రం పూర్తిగా పైచేయి సాధించింది.

తుదకు ‘షూటౌట్‌’లో 3–1తో జపాన్‌ను ఓడించి ఈ మెగా ఈవెంట్‌లో మూడోసారి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1998లో మూడో స్థానం పొందిన క్రొయేషియా, 2018లో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు జపాన్‌ ప్రస్థానం నాలుగోసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కే పరిమితమైంది. గతంలో మూడుసార్లు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరి ఈ గండాన్ని అధిగమించలేకపోయిన ‘బ్లూ సమురాయ్‌’ బృందానికి నాలుగోసారీ నిరాశే ఎదురైంది.  


క్రొయేషియా సంబరం 

ముందుగా ఆట 43వ నిమిషంలో డైజెన్‌ మేడా గోల్‌తో జపాన్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 55వ నిమిషంలో లావ్రెన్‌ కుడి వైపు     నుంచి కొట్టిన క్రాస్‌ షాట్‌ను ‘డి’ ఏరియాలో పెరిసిచ్‌ హెడర్‌ షాట్‌తో గోల్‌గా మలచడంతో క్రొయేషియా స్కోరును 1–1తో సమం చేసింది. అనంతరం రెండు జట్లు మరో గోల్‌ చేయకపోవడంతో నిర్ణీత సమయానికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి.

ఫలితం తేలడానికి అదనపు సమయం (15 నిమిషాలు నిడివి గల రెండు భాగాలు) ఆడించారు. అదనపు సమయంలోనూ స్కోరు సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్‌’ అనివార్యమైంది. ‘షూటౌట్‌’లో క్రొయేషియా గోల్‌కీపర్‌ లివాకోవిచ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. జపాన్‌ ఆటగాళ్లు కొట్టిన మూడు షాట్‌లను నేర్పుతో నిలువరించాడు. మరోవైపు క్రొయేషియా జట్టులో లివాజా కొట్టిన షాట్‌ గోల్‌పోస్ట్‌ బార్‌కు తగిలి పక్కకు వెళ్లగా, మిగతా ముగ్గురు ఆటగాళ్లు జపాన్‌ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి బంతిని లక్ష్యానికి చేర్చారు. బ్రెజిల్, దక్షిణ కొరియా మ్యాచ్‌ విజేతతో క్వార్టర్‌ ఫైనల్లో క్రొయేషియా ఆడుతుంది.   

మరిన్ని వార్తలు