Luka Modric: అల్విదా 'లుకా మోడ్రిక్‌'.. నాయకుడంటే నీలాగే

14 Dec, 2022 13:26 IST|Sakshi

లుకా మోడ్రిక్‌.. ఈతరం ఫుట్‌బాల్‌ స్టార్స్‌లో ఒకడు. మెస్సీ, రొనాల్డో లాగా పాపులారిటీ లేనప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనామక జట్టుగా ఉన్న క్రొయేషియాను లుకా మోడ్రిక్‌ నడిపిన తీరు అద్బుతమని చెప్పొచ్చు. వరుసగా రెండు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అసాధారణ ఆటతీరు కనబరిచి అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ మోడ్రిక్‌ జట్టును అన్నీ తానై నడిపించాడు. నాయకుడంటే ఇలాగే ఉండాలి అనే పదానికి నిర్వచనంగా నిలిచాడు లుకా మోడ్రిక్‌.

2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌ను ఆరంభించిన లుకా మోడ్రిక్‌ తొలి రెండు వరల్డ్‌కప్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2010, 2014 వరల్డ్‌కప్స్‌లో క్రొయేషియా గ్రూప్‌ దశలోనే వెనుదిరిగడం మోడ్రిక్‌ను వెలుగులోకి తీసుకురాలేకపోయింది. ఇక 2014 ఫిఫా వరల్డ్‌కప్‌.. గ్రూప్‌ దశలోనే క్రొయేషియా జట్టు వెనుదిరిగింది. కేవలం 40 లక్షల జనాభా మాత్రమే కలిగిన క్రొయేషియా వచ్చే నాలుగేళ్లలో అద్భుతం చేయబోతుందని అప్పట్లో ఎవరు ఊహించలేదు.

2014 తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మోడ్రిక్‌ దశ దిశ లేకుండా అనామక జట్టుగా ఉన్న క్రొయేషియాను గాడిలో పెట్టాడు. ఆ తర్వాత నాలుగేళ్లలో జట్టులో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. మేజర్‌ టోర్నీలు గెలవకపోయినప్పటికి జట్టును బలంగా తయారు చేయడంలో మాత్రం సఫలమయ్యాడు. ఇక 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా.. ఈసారి కూడా దాదాపు అదే ఫలితాలను రిపీట్‌ చేసింది.

కీలకమైన నాకౌట్స్‌లో బ్రెజిల్‌, జపాన్‌ లాంటి మేటి జట్లకు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అలా వరుసగా రెండు వరల్డ్‌కప్స్‌లో ఒకసారి రన్నరప్‌.. మరోసారి సెమీఫైనల్‌ వరకు వచ్చిందంటే లుకా మోడ్రిక్‌ జట్టులో నింపిన చైతన్యం వల్లే అని చెప్పొచ్చు. ఈసారి లుకా మోడ్రిక్‌తో పాటు గోల్‌ కీపర్‌ డొమినిక్‌ లివకోవిచ్‌ , ఇవాన్‌ పెరిసిక్‌, డెజన్‌ లొవ్‌రెన్‌, మార్సిలో బ్రొజోవిక్‌లు నాలుగు స్తంభాలుగా మారి క్రొయేషియాను ముందుకు నడిపించారు. 37 ఏళ్ల లుకా మోడ్రిక్‌ తన చివరి ఫిఫా వరల్డ్‌కప్‌ ఆడేసినట్లే.

క్రొయేషియా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా లుకా రికార్డు నెలకొల్పాడు. క్రొయేషియా తరపున 161 మ్యాచ్‌ల్లో 23 గోల్స్‌ సాధించాడు. మిడ్‌ఫీల్డర్‌గా బాధ్యతలు నిర్వర్తించే లుకా మోడ్రిక్‌ ఎక్కువ గోల్స్‌ చేయకపోయినప్పటికి పాస్‌లు అందించడంలో మాత్రం దిట్ట. 2006 నుంచి 16 ఏళ్ల పాటు క్రొయేషియా జట్టుకు సేవలందించిన లుకా మోడ్రిక్‌.. ఫిఫి వరల్డ్‌కప్‌ గెలవలేదన్న కోరిక మినహాయిస్తే జీవితంలో అన్నీ చూశాడు.

2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్డెన్‌ బాల్‌ అందుకున్న లుకా.. 2018లోనే ప్రతిష్టాత్మక బాలన్‌ డీ ఓర్‌ అవార్డు, యూఈఎఫ్‌ఏ మెన్స్‌ ప్లేయర్‌ అవార్డులను గెలుచుకున్నాడు. ఇక 2019లో గోల్డెన్‌ ఫుట్‌ అవార్డు గెలుచుకున్న లుకా మోడ్రిక్‌ ఆటకు నీరాజనం పలుకుతూ అతని మలి కెరీర్‌ కూడా ఆనందంగా సాగిపోవాలని కోరుకుందాం.

చదవండి: దెబ్బకు దెబ్బ తీశారు.. లెక్క సరిచేసిన మెస్సీ

Luka Modric: 'ఈ వరల్డ్‌కప్‌ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు'

>
మరిన్ని వార్తలు