దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు డైరెక్టర్ల రాజీనామా 

27 Oct, 2020 09:01 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ) డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. మొత్తం పది మంది డైరెక్టర్లు ఉండగా... ఆరుగురు సభ్యులు ఆదివారమే సీఎస్‌ఏ నుంచి వైదొలగగా... మిగిలిన నలుగురు సోమవారం తప్పుకున్నారు. ఈ విషయాన్ని సీఎస్‌ఏ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. గతంలో బోర్డుపై అవినీతి, జాతి వివక్ష, పరిపాల దుర్వినియోగం, ఆటగాళ్ల జీతాల చెల్లింపుల్లో అవకతవకలు వంటి ఆరోపణలు రావడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆ దేశపు క్రీడా మంత్రి నాతి మెథ్వా స్వయంగా రంగంలోకి దిగారు.

అయితే బోర్డు డైరెక్టర్ల నుంచి çసహకారం అందకపోవడంతో ఆగ్రహించిన మెథ్వా... తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలిపేలా ఈ నెల 27లోపు వాదనలు వినిపించాలని సీఎస్‌ఏ డైరెక్టర్లను ఆదేశించారు. అంతేకాకుండా బోర్డును రద్దు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. దాంతో ఆదివారం సమావేశమైన సీఎస్‌ఏ డైరెక్టర్లు... తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాలో క్రికెట్‌ వ్యవహారాలను చూసుకోవడానికి రిహాన్‌ రిచర్డ్స్‌ను నియమించిన దక్షిణాఫ్రికా స్పోర్ట్స్‌ కాన్ఫడరేషన్, ఒలింపిక్‌ కమిటీ (ఎస్‌ఏఎస్‌సీఓసీ)... త్వరలోనే సీఎస్‌ఏ స్థానంలో తాత్కాలిక స్టీరింగ్‌ కమిటీని నియమిస్తామని ప్రకటించింది.

మరిన్ని వార్తలు