MS Dhoni: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే!

13 Aug, 2022 10:24 IST|Sakshi
ఎంఎస్‌ ధోని (PC: CSK/IPL)

South Africa T20 League: పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో వినోదాన్ని పంచేందుకు మరో సరికొత్త టీ20 లీగ్‌ త్వరలోనే ఆరంభం కానుంది. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు వచ్చే ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌ టోర్నీతో ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే, పేరుకు ఇది ప్రొటిస్‌ లీగ్‌ అయినా ఇందులో పాల్గొనబోయే ఆరు జట్లను బీసీసీఐ నిర్వహించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగమైన ఫ్రాంఛైజీలే కొనుగోలు చేయడం విశేషం.

కేప్‌టౌన్‌ ఫ్రాంఛైజీని ముంబై ఇండియన్స్‌, జోహన్నెస్‌బర్గ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌, డర్బన్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌, పోర్ట్‌ ఎలిజబెత్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ప్రిటోరియాను ఢిల్లీ క్యాపిటల్స్‌, పర్ల్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై యాజమాన్యం సీఎస్‌కే కెప్టెన్‌, భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనిని తమ మెంటార్‌ నియమించిందన్న వార్తలు గుప్పుమన్నాయి.

ఛాన్సే లేదు!
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా లీగ్‌లో భారత ఆటగాళ్లు భాగం కానున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ విషయంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధికారి ఒకరు తాజాగా స్పందించారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లు ఎవరూ కూడా విదేశీ లీగ్‌లలో ఆడే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అలా ఆడాలని కోరుకుంటే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరైన తర్వాతే ఛాన్స్‌ ఉంటుందని కుండబద్దలు కొట్టారు.

అన్ని సంబంధాలు తెంచుకున్న తర్వాతే!
ఈ మేరకు.. ‘‘అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగేంత వరకు ఏ ఒక్క భారత క్రికెటర్‌.. దేశవాళీ ఆటగాళ్లు సైతం ఇతర లీగ్‌లలో ఆడకూడదనేది సుస్పష్టం. ఒకవేళ ఎవరైనా రానున్న లీగ్‌లలో ఆడాలని కోరుకుంటే బీసీసీఐతో సంబంధాలు అన్నీ తెంచుకున్న తర్వాతే అతడికి ఆ అవకాశం ఉంటుంది’’ సదరు అధికారి పునుద్ఘాటించారు. ఇదిలా ఉంటే సీఎస్‌కే జొహన్నస్‌బర్గ్‌ ఫ్రాంఛైజీతో ప్రొటిస్‌ ఆటగాడు ఫాఫ్‌ డు ప్లెసిస్‌, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఒప్పందం చేసుకున్నారు.  

చదవండి: CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్‌ గ్రూప్‌.. బట్లర్‌ సహా..
Ind Vs Zim ODI Series: టీమిండియా కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌..

మరిన్ని వార్తలు