వాట్సన్‌ ఫామ్‌లోకి.. సీఎస్‌కే టచ్‌లోకి

4 Oct, 2020 23:10 IST|Sakshi

దుబాయ్‌:ఐపీఎల్‌ సీజన్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ సుదీర్ఘ విరామం తర్వాత మరో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసిన సీఎస్‌కే.. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది. షేన్‌ వాట్సన్‌ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ మళ్లీ రాణించడంతో సీఎస్‌కే 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వాట్సన్‌(83 నాటౌట్‌; 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ), డుప్లెసిస్‌(87 నాటౌట్‌; 53 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్‌)లు కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో సీఎస్‌కేకు తిరుగులేకుండా పోయింది. ఈ టోర్నీ ఆరంభమైన తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వాట్సన్‌.. తాజా మ్యాచ్‌లో విశేషంగా రాణించడంతో సీఎస్‌కే 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇక డుప్లెసిన్‌ తన ఫామ్‌ను కొనసాగించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కేకు అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం విశేషం.(చదవండి: స్టోక్స్‌ వచ్చాడు.. క్వారంటైన్‌కు వెళ్లాడు)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ పంజాబ్‌ 179 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కింగ్స్‌ పంజాబ్‌కు శుభారంభం లభించింది. మయాంక్‌ అగర్వాల్‌(26; 19 బంతుల్లో 3 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌(63; 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌)లు తొలి వికెట్‌కు 61 పరుగులు జత చేశారు. పీయూష్‌ చావ్లా బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత మన్‌దీప్‌ సింగ్‌(27;16 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కింగ్స్‌ పంజాబ్‌ స్కోరు 94 పరుగుల వద్ద ఉండగా మన్‌దీప్‌ సింగ్‌ను రవీంద్ర జడేజా ఔట్‌ చేశాడు. ఆపై పూరన్‌-రాహుల్‌ల జోడి పంజాబ్‌ స్కోరును చక్కదిద్దింది. ఈ జోడి మూడో వికెట్‌కు 58 పరుగుల జత చేసిన తర్వాత పూరన్‌(33; 17 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. 18 ఓవర్‌ తొలి బంతికి పూరన్‌ ఔట్‌ చేసిన శార్దూల్‌ ఠాకూర్‌..ఆ మరుసటి బంతికి రాహుల్‌ను ఔట్‌ చేశాడు. దాంతో 152 పరుగుల వద్ద పూరన్‌, రాహుల్‌ వికెట్లను కింగ్స్‌  పంజాబ్‌ కోల్పోయింది. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు మందగించింది. మ్యాక్స్‌వెల్‌(11 నాటౌట్‌), సర్పరాజ్‌ ఖాన్‌(14 నాటౌట్‌)ల నుంచి భారీ షాట్ల రాకపోవడంతో పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా, పీయూష్‌ చావ్లాలు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు