-

‘మాది తండ్రీ కొడుకుల బంధం’

3 Sep, 2020 08:06 IST|Sakshi

 మెతకబడిన సీఎస్‌కే చీఫ్‌ శ్రీనివాసన్‌

 మళ్లీ జట్టుతో చేరేందుకు సిద్ధమన్న రైనా

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టులో హైరానాకు కారణమైన సురేశ్‌ రైనా వివాదం త్వరగానే సమసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రైనా తనకు పుత్ర సమానుడంటూ జట్టు యజమాని ఎన్‌. శ్రీనివాసన్‌ భరోసానివ్వగా... తన దృష్టిలో ఆయన తండ్రి అంతటివాడంటూ రైనా కూడా గౌరవాన్ని ప్రదర్శించాడు. రైనా వ్యవహారశైలితో ఆరంభంలో ఆగ్రహం ప్రదర్శించిన శ్రీనివాసన్‌... అతను స్వయంగా ఫోన్‌ చేసి వివరణ ఇవ్వడంతో సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ‘హోటల్‌ గది’ వార్త ఎవరో కావాలని సృష్టించారని రైనా స్పష్టం చేశాడు. జట్టు ఎంపిక విషయంలో తన పాత్ర ఏమీ లేదని శ్రీనివాసన్‌ చెబుతున్నా... ధోని అండ, సీఈఓ కాశీ విశ్వనాథన్‌ కూడా రైనా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో అతను మళ్లీ జట్టుతో చేరి ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. (చదవండి: బీసీసీఐకి ఐపీఎల్‌ ఫ్రాంచైజీల విజ్ఞప్తి)

‘రైనాను నేను నా కొడుకులాగా చూసుకున్నాను. అయితే రైనా పునరాగమనం విషయంలో నా పాత్ర ఏమీ ఉండదు. క్రికెట్‌ వ్యవహారాల్లో యాజమాన్యం జోక్యం చేసుకోకపోవడమే ఐపీఎల్‌లో మా జట్టు విజయరహస్యం. 1960ల నాటినుంచి క్రికెట్‌ను ఇండియా సిమెంట్స్‌ కంపెనీ అలాగే నడిపిస్తోంది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మా జట్టుకు మేం యజమానులమే తప్ప ఆటగాళ్లకు కాదు. క్రికెటర్లు నా సొంతం కాదు. అతడిని తీసుకునే అంశంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంటుంది. నేను జట్టు కెప్టెన్‌ను కాదు. ఎవరు ఆడాలి, వేలంలో ఎవరిని తీసుకోవాలి అనే విషయాలు నేను ఎప్పుడూ చెప్పలేదు. ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్‌ మా జట్టుతో ఉన్నప్పుడు మేమెందుకు జోక్యం చేసుకుంటాం.     
–ఎన్‌. శ్రీనివాసన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని 

‘నన్ను మళ్లీ మీరు చెన్నై శిబిరంలో చూస్తారేమో! ఇప్పుడే ఏమీ చెప్పలేను. ముందుగా నేను ఇక్కడ కొన్ని బాధ్యతలు పూర్తి చేసి అప్పుడు సిద్ధమవుతా. ఇంట్లో అత్యవసరంగా చక్కబెట్టాల్సిన కొన్ని పనులు ఉండటంతో నా కుటుంబం కోసం వెనక్కి రావాల్సి వచ్చింది. సూపర్‌ కింగ్స్‌ జట్టు నా కుటుంబంలాంటిది. ధోని భాయ్‌ నా జీవితంలో అత్యంత కీలక వ్యక్తి. అయితే కఠిన నిర్ణయమే అయినా ఇంటికి వచ్చేశాను. శ్రీనివాసన్‌ నాకు తండ్రిలాంటివారు. నా మనసుకు దగ్గరైన వ్యక్తి. ఎంతో అండగా నిలుస్తూ చిన్న కొడుకులాగా చూసుకున్నారు. బహుశా ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ఉంటారు. అప్పటికి నేను రావడానికి కారణం ఆయనకు తెలీదు. ఇప్పుడు అంతా చక్కబడింది. నాకు మెసేజ్‌ కూడా పంపించారు. ఆ అంశంపై వివరంగా మాట్లాడుకున్నాం. అయితే ఒక తండ్రి తన పిల్లలను కోప్పడితే తప్పేముంది. నాకు, సీఎస్‌కేకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప ఎవరైనా రూ. 12.5 కోట్లు వదిలేసుకొని వచ్చేస్తారా. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా నా వయసు ఎక్కువేం కాదు. కనీసం 4–5 ఏళ్లు ఐపీఎల్‌ ఆడగలను. ఇక్కడికి వచ్చాక క్వారంటైన్‌లో ఉంటూ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఈ వివాదాన్ని మరచి ముందుకు వెళ్లాలని భావిస్తున్నా. 
–సురేశ్‌ రైనా

మరిన్ని వార్తలు