IPL 2022: దీపక్‌ చహర్‌ ఔట్‌.. సీఎస్‌కే అధికారిక ప్రకటన

15 Apr, 2022 18:50 IST|Sakshi
Courtesy: IPL Twitter

దీపక్‌ చహర్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌కు పూర్తిగా దూరమైనట్లు సీఎస్‌కే శుక్రవారం ట్విటర్‌ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ''మిస్‌ యూ దీపక్‌ చహర్‌.. తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. దీపక్‌ చహర్‌ దూరమవ్వడం సీఎస్‌కేకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. గత సీజన్‌లో సీఎస్‌కే విజేతగా నిలవడంలో దీపక్‌ చహర్‌ కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్‌లో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు చవిచూసిన జడ్డూ సేన ఆర్‌సీబీతో మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టింది. ఇక రెండు రోజుల క్రితం దీపక్‌ చహర్‌ వెన్నుముక గాయంతో బాధపడుతున్నట్లు తేలింది.

అంతకముందు తొడ కండరాల గాయంతో విండీస్‌తో సిరీస్‌కు దూరమైన చహర్‌.. ఎన్‌సీఏ రీహాబిటేషన్‌లో చేరి అక్కడే కోలుకున్నాడు. ఇక సీఎస్‌కేలో చేరతాడు అనే సమయానికి దురదృష్టవశాత్తూ చహర్‌కు వెన్నుముక గాయం తిరగబెట్టింది. నాలుగు నెలల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. దీంతో దీపక్‌ చహర్‌ ఐపీఎల్‌తో పాటు రాబోయే టి20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉ‍న్నాయి.


Courtesy: IPL Twitter

మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ రషీక్‌ సలామ్‌ వెన్నునొప్పి గాయంతో ఐపీఎల్‌ 2022 సీజన్‌ నుంచి వైదొలిగాడు. రషీక్‌ సలామ్‌ వెన్నుముక నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. స్కానింగ్‌లో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో రషీక్‌ సీజన్‌కు దూరమవుతున్నట్లు కేకేఆర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రషీక్‌ సలామ్‌ ఈ సీజన్‌లో కేకేఆర్‌ తరపున రెండు మ్యాచ్‌లు ఆడాడు. అతని స్థానంలో ఢిల్లీకి చెందిన హర్షిత్‌ రాణా కనీస ధర రూ.20 లక్షలకు కేకేఆర్‌ భర్తీ చేయనున్నట్లు ట్విటర్‌లో తెలిపింది.

మరిన్ని వార్తలు