రైనాకు మరోషాక్‌.. చెన్నై కాంట్రాక్టు రద్దు..!

2 Oct, 2020 11:44 IST|Sakshi

దుబాయ్‌ : హాట్‌ ఫేవరెట్‌గా ఐపీఎల్‌ లీగ్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు (సీఎస్‌కే) అంచనాలను అందుకోలేపోతుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ధోనీ జట్టు వరుస రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో వారంలోనే పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. హిట్టింగ్‌లేని బ్యాటింగ్‌తో పాటు పసలేని బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లతో పోటీపడలేక వెనుకబడుతోంది. అయితే ఈ జట్టు సీనియర్‌ ఆటగాడు,  స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతుండగా.. ఇక రైనా వైపు తిరిగిచూసే ప్రసక్తేలేదని సీఎస్‌కే సీఈవో విశ్వనాథన్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ('రైనా.. ప్లీజ్‌ తిరిగి రావా')

తన వ్యక్తిగత కారణాల వల్ల రైనా లీగ్‌ నుంచి నిష్క్రమించాడని, అతను లేని లోటును రిజర్వుబెంచ్‌లోని ప్లేయర్ల ద్వారా భర్తీచేస్తామని ప్రకటించాడు. ఈ క్రమంలోనే రైనాతో పాటు మరోసీనియర్‌ ఆటగాడు హర్బజన్‌ సింగ్‌ పేర్లను సీఎస్‌కే అధికార  వెబ్‌సైట్‌ నుంచి తొలగించించింది. సీఎస్‌కే నిర్ణయంతో రైనాకు పూర్తిగా దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. మొన్నటి వరకు రైనా తిరిగి వస్తాడనుకున్న రైనా ఆశలు కూడా అడియాశలై పోయాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఈ ఇద్దరు ఆటగాళ్లపై మరో చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రైనాతో పాటు సీనియర్‌ స్పిన్నర్‌ హర్బజన్‌తో తమకున్న కాంట్రాక్టులను పూర్తిగా రద్దు చేసుకోవాలని సీఎస్‌కే భావిస్తున్నట్ల వార్తలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్న ఇరువురి ఆటగాళ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. దీనిపై జట్టు యాజమాన్యం నుంచి అధికారిక ‍ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరొందిన రైనాకు సీఎస్‌కే ప్రస్తుత సీజన్‌లో రూ.11కోట్లు వెచ్చిస్తోంది. (చెన్నైకి అదనపు బౌలర్‌ కావాలి!)

మిస్టర్‌ కూల్‌ ముందుకు వస్తాడా..?
మరోవైపు వరుస రెండు మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన సీఎస్‌కే.. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. మొదటి మ్యాచ్‌లో మెరిపించిన అంబటి రాయుడు నేటి మ్యాచ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కెప్టెన్‌ ధోనీపై అభిమానులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. రైనాలేని లోటును ఏ ఆటగాడు కూడా భర్తీచేయకపోవడంతో టాప్‌ఆర్డర్‌లో కొంత వెలితి కనిపిస్తోంది. గత మూడు మ్యాచ్‌ల్లో బ్యాంటింగ్‌ ఆర్డర్‌లో వెనుక వచ్చిన ధోనీ హైదరాబాద్‌తో మ్యాచ్‌ నుంచి ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక దుబాయ్‌ వేదికగా జరిగే నేటి మ్యాచ్‌లో మిస్టర్‌ కూల్‌ ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాడో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు