#IPL2023Final: సీఎస్‌కే ఐదోసారి కొడుతుందా లేక గుజరాత్‌ డబుల్‌ ధమాకానా?

27 May, 2023 23:06 IST|Sakshi
Photo: IPL Twitter

రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌ 16వ సీజన్‌కు మరొక రోజులో తెరపడనుంది. ఈ సీజన్‌లో పది జట్లు బరిలోకి దిగితే.. ఆఖరి అంకానికి రెండు జట్లు చేరుకున్నాయి. ఒకటి నాలుగుసార్లు ఛాంపియన్‌ సీఎస్‌కే అయితే.. రెండో జట్టు గతేడాది డిపెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌.

2022 సీజన్‌లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరున నిలిచిన సీఎస్‌కే అంచనాలకు మించి రాణించి ఫైనల్లో అడుగుపెట్టగా.. మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌ గతేడాది ఆటనే గుర్తుచేస్తూ రెండోసారి ఫైనల్‌ చేరింది. మరి ఈ ఇద్దరిలో విజేత అయ్యేది ఎవరు? ధోని సారధ్యంలో సీఎస్‌కే ఐదోసారి కప్‌ కొడుతుందా లేక పాండ్యా సారధ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండోసారి టైటిల్‌ ఎగరేసుకుపోతుందా అన్నది మరొక రోజులో తెలియనుంది.

సీఎస్‌కే బలం ఓపెనింగ్‌..
సీఎస్‌కే బలం ఓపెనింగ్‌ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డెవాన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌ జంట సీఎస్‌కేకు అదిరిపోయే ఆరంభాలు ఇస్తూ పటిష్టస్థితిలో నిలుపుతున్నారు. తర్వాతి పనిని రహానే, శివమ్‌ దూబే, జడేజాలు పూర్తి చేస్తుండగా.. ఆఖర్లో ధోని ఫినిషర్‌ పాత్రను పోషిస్తున్నాడు.

ఇక బౌలింగ్‌లో ధోని తనదైన వ్యూహాలతో తెలివిగా ఉపయోగించుకుంటున్నాడు. దీపక్‌ చహర్‌, రవీంద్ర జడేజా, మతిషా పతిరానా, మహీష్‌ తీక్షణ, తుషార్‌ దేశ్‌ పాండేలు అదరగొడుతున్నారు. ధోని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వారితో బౌలింగ్‌ చేయించి ఫలితాలు రాబడుతున్నాడు.

గుజరాత్‌ సగం బలం గిల్‌..
ఇక గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌కు సగం బలం శుబ్‌మన్‌ గిల్‌ అని నిస్సేందహంగా చెప్పొచ్చు. వరుస శతకాలతో రెచ్చిపోతున్న గిల్‌కు ముకుతాడు వేస్తేనే సీఎస్‌కేకు అవకాశం ఉంటుంది. గిల్‌ మినహా జట్టులో పెద్దగా రాణిస్తున్నవారు లేకపోయినప్పటికి అవసరానికి పాండ్యా, సాహా, సాయి సుదర్శన్‌, విజయ్‌ శంకర్‌లు మెరుస్తున్నారు. ఇక రషీద్‌ ఖాన్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో గుజరాత్‌ విజయాల్లో కీలకంగా మారాడు. ఇక బౌలింగ్‌లో షమీ, మోహిత్‌ శర్మ, రషీద్‌, నూర్‌ అహ్మద్‌లు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

దీంతో రేపటి ఫైనల్‌ పోరు ఉత్కంఠగా సాగడం ఖాయమనిపిస్తోంది. చూడాలి సీఎస్‌కే ఐదోసారి కప్‌కొట్టి ధోనికి కానుకగా ఇస్తుందో లేక గుజరాత్‌కు రెండోసారి టైటిల్‌ అందించి పాండ్యా విజయవంతమైన కెప్టెన్‌గా నిలుస్తాడో చూడాలి.

చదవండి: ముందే అనుకున్నారా.. కలిసే సెంచరీలు కొడుతున్నారు!

మరిన్ని వార్తలు