సీఎస్‌కే అత్యల్ప స్కోరు..!

19 Oct, 2020 21:21 IST|Sakshi

అబుదాబి: రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే 126 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మోస్తరు స్కోరును మాత్రమే బోర్డుపై ఉంచింది. డుప్లెసిస్‌(10), వాట్సన్‌(8), అంబటి రాయుడు((13)లు తీవ్రంగా నిరాశపరచగా, సామ్‌ కరాన్‌(22) ఫర్వాలేదనిపించాడు.  ఇక రవీంద్ర జడేజా(35 నాటౌట్‌; 30 బంతుల్లో 4 ఫోర్లు), ధోని(28; 28 బంతుల్లో 2 ఫోర్లు)లు మరమ్మత్తులు చేయడంతో 120 పరుగు మార్కును చేరింది. 56 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ధోని-జడేజాలు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే యత్నం చేశారు. ఎక్కువగా స్టైక్‌రొటేట్‌ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కాగా, కార్తీక్‌ త్యాగి వేసిన 14వ ఓవర్‌లో వీరిద్దరూ మూడు బౌండరీల సాయంతో 14 పరుగులు సాధించడం మినహా పెద్దగా మెరుపులు రాలేదు. కాగా, ఈ జోడి 51 పరుగులు జత చేసిన తర్వాత ధోని రనౌట్‌ అయ్యాడు. రాజస్తాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగి, శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌ తెవాటియాలు తలో వికెట్‌ తీశారు.

చివరి పది ఓవర్లలో 69 పరుగులు
ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ బౌలింగ్‌లో దుమ్మురేపింది. ప్రధానంగా జోఫ్రా ఆర్చర్‌తో పాటు శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌ తెవాటియా అద్భుతమైన స్పెల్‌లతో అదరగొట్టారు. ఆర్చర్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 20  పరుగులే ఇచ్చి వికెట్‌ తీయగా, గోపాల్‌ నాలుగు ఓవర్లలో వికెట్‌ సాధించి 14 పరుగులు ఇచ్చాడు. తెవాటియా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. వీరు ముగ్గురూ 12 ఓవర్లలో 52 పరుగులే ఇచ్చారు. దాంతో సీఎస్‌కే రన్‌రేట్‌ దారుణంగా పడిపోయింది.  చివరి పది ఓవర్లలో సీఎస్‌కే 69 పరుగులే చేసి వికెట్‌ను కోల్పోయింది. తొలి పది ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసి నాలుగు వికెట్లను సీఎస్‌కే కోల్పోయింది. సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఈ ఐపీఎల్‌ ఇదే అత్యల్ప స్కోరుగా నమోదైంది. రాజస్తాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సీఎస్‌కే పరుగులు చేయలేక అపసోపాలు పడింది.మరి ఇప్పుడు ఈ అత్యల్ప స్కోరును ఎలా కాపాడుకుంటుందో చూడాలి. సీఎస్‌కే డెత్‌ బౌలింగ్‌ బలహీన పడటంతో రాజస్తాన్‌ను ఎలా కట్టడి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.  బ్రేవో లేకపోవడంతో డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ సీఎస్‌కేకు ఒక లోటుగా కనబడుతోంది. 

>
మరిన్ని వార్తలు