చెలరేగిన రాయుడు, జడేజా

17 Oct, 2020 21:17 IST|Sakshi

షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 180 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అంబటి రాయుడు(45 నాటౌట్‌; 25 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్స్‌లు) రవీంద్ర జడేజా(33 నాటౌట్‌; 13 బంతుల్లో 4 సిక్స్‌లు), డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో సీఎస్‌కే పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే ఆదిలోనే సామ్‌ కరాన్‌ వికెట్‌ను కోల్పోయింది. తుషార్‌ దేశ్‌పాండే వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే కరాన్‌ డకౌట్‌ అయ్యాడు. ఆ సమయంలో డుప్లెసిస్‌కు షేన్‌ వాట్సన్‌ జత కలిశాడు. ఈ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.  

వాట్సన్‌ 28 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేసిన తర్వాత వాట్సన్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. నోర్జే బౌలింగ్‌లో వాట్సన్‌ ఔటయ్యాడు. ఆపై డుప్లెసిస్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా,  మూడో వికెట్‌గా డుప్లెసిస్‌ పెవిలియన్‌ చేరాడు. రబడా బౌలింగ్‌లో ధావన్‌ క్యాచ్‌ పట్టడంతో డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌  ముగిసింది. ఇక కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని(3) విఫలమయ్యాడు. నోర్జే వేసిన 17 ఓవర్‌ మూడో బంతికి కీపర్‌ అలెక్స్‌ క్యారీ క్యాచ్‌ పట్టగా ధోని నిష్క్రమించాడు.  కాగా, అంబటి రాయుడు( 50) మరోసారి మంచి ఇన్నింగ్స్‌ ఆడటంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో  నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు సాధించగా, రబడా, దేశ్‌పాండేలకు తలో వికెట్‌ దక్కింది.

స్లోబాల్‌కు ధోని బోల్తా..
ఈ సీజన్‌లో 150పైగా కి.మీ వేగంతో బంతుల్ని సునాయాసంగా  వేస్తున్న అన్‌రిచ్‌ నోర్జే.. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోనికి స్లోబాల్‌ వేశాడు. డుప్లెసిస్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోని కేవలం ఐదు బంతుల్ని మాత్రమే ఎదుర్కొన్నాడు. 17 ఓవర్‌లో తొలి బంతిని రాయుడు సిక్స్‌ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్‌ తీశాడు.  దాంతో ధోని స్టైకింగ్‌కు వచ్చాడు. అయితే నోర్జే తెలివిగా స్లో బాల్‌తో ధోనిని బోల్తా కొట్టించాడు.  తన సీమ్‌ను కాస్త మార్చిన నోర్జే.. 134. 3కి.మీ వేగంతో బంతిని వేశాడు. సాధారణంగా నోర్జే బంతులు వేగంగా వస్తుండటంతో ఆ బంతిని అంచనా వేయడంలో ధోని అంచనా తప్పింది. ఆ బంతిని హిట్‌ చేయడానికి యత్నించగా అది ఎడ్జ్‌ తీసుకుని కీపర్‌ క్యారీ చేతుల్లోకి వెళ్లింది. ఆ బాల్‌కు ధోని కంప్లీట్‌గా లైన్‌ తప్పడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. విలువైన ధోని వికెట్‌ను సాధించడంలో నోర్జే సక్సెస్‌ కావడంతో సీఎస్‌కే స్కోరులో వేగం తగ్గింది. చివర్లో రాయుడు, జడేజాలు బ్యాట్‌ ఝుళిపించడంతో సీఎస్‌కే గౌరవప్రదమైన స్కోరును సాధించింది. వీరిద్దరూ చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు సాధించారు.

మరిన్ని వార్తలు