CSK VS DC: డెవాన్‌ కాన్వేను దిగ్గజ ఆటగాడితో పోలుస్తున్న నెటిజన్లు

9 May, 2022 16:57 IST|Sakshi
Photo Courtesy: IPL

Devon Conway Compared With Mike Hussey: ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మే 7) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్‌ డెవాన్ కాన్వే (49 బంతుల్లో 87; 7 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లోనూ కాన్వే ఇదే తరహాలో రెచ్చిపోయి వరుస హాఫ్‌ సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో కాన్వేపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు, విశ్లేషకులు ఈ న్యూజిలాండ్‌ ఆటగాడిని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌, సీఎస్‌కే బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీతో పోలుస్తున్నారు. 

మైక్‌ హస్సీతో పోల్చడంపై కాన్వే స్పందిస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌తో పాటు విశ్వ వేదికపై ఘన చరిత్ర కలిగిన హస్సీ లాంటి దిగ్గజ ఆటగాడితో తనను పోల్చడం ఎంతో ప్రత్యేకమైందని చెప్పుకొచ్చాడు. హస్సీ మార్గదర్శకంలో తాను మరింత రాటుదేలానని, హస్సీతో సన్నిహితంగా మెలగడం ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు. హస్సీ లాంటి అనుభవం కలిగిన వ్యక్తి నుంచి బ్యాటింగ్‌కు సంబంధించి ఎన్నో టెక్నిక్స్‌ నేర్చుకున్నానని.. ఇవి తన కెరీర్‌ ఉన్నతి తప్పక తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

నేను అమితంగా ఆరాధించే వ్యక్తితో తనను పోల్చడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని తెలిపాడు. తన పరిధిలో ఉన్న ఏ సవాలునైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇందుకు సీఎస్‌కే జట్టు నుంచి తనకు గొప్ప సహకారం లభిస్తుందని వివరించాడు. ఇటీవల జరిగిన తన వివాహ సమయంలో జట్టు సభ్యులందరూ తనకెంతగానో సహకరించారని, తన జీవితంలో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని జట్టు సభ్యులంతా దగ్గరుండి జరిపించారని గుర్తు చేసుకున్నాడు.  

కాగా, దక్షిణాఫ్రికాతో పుట్టి న్యూజిలాండ్‌ క్రికెటర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డెవాన్‌ కాన్వే.. 2022 ఐపీఎల్‌ సీజన్‌తో సీఎస్‌కేతో జతకట్టాడు. సీఎస్‌కే యాజమాన్యం కాన్వేను కోటి రూపాయల బేస్‌ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన అనంతరం గర్ల్ ఫ్రెండ్ కిమ్ వాట్సన్‌తో వివాహం కోసం అతను కొన్ని రోజులు బయోబబుల్‌ను విడిచి వెళ్లాడు. వివాహం అనంతరం జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కాన్వే వీర లెవెల్లో రెచ్చిపోతూ వరుస హాఫ్‌ సెంచరీలు సాధిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. వివాహం అనంతరం స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో 85 ప‌రుగులు చేసిన కాన్వే.. ఆత‌రువాత ఆర్సీబీపై 37 బంతుల్లో 56, తాజాగా డీసీపై 49 బంతుల్లో 87 ప‌రుగులు స్కోర్ చేశాడు. 
చదవండి: ఐపీఎల్‌ హంగామా నడుస్తున్నా నేనున్నానని గుర్తు చేస్తున్న పుజారా..!

మరిన్ని వార్తలు