CSK Vs DC: అతడితో 19వ ఓవర్‌ వేయించాల్సింది.. ఆ నిర్ణయం తప్పు: గంభీర్‌

11 Oct, 2021 11:05 IST|Sakshi
Photo Credit: CSK Twitter

Gautam Gambhir Commnets On DC Loss to CSK in Qualifier 1: ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌.. చివరి రెండు ఓవర్లలో చెన్నైకి 24 పరుగులు అవసరం... పర్లేదు.. టార్గెట్‌ కొట్టేయచ్చు. కానీ.. అప్పటి వరకు అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రుతురాజ్‌ గైక్వాడ్‌(50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔటవ్వడంతో చెన్నై శిబిరంలో ఆందోళన కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్‌ ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి రుతురాజ్‌ పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ధోని... కాస్త కుదురుకున్నాక భారీ సిక్సర్‌తో ఆవేశ్‌ ఖాన్‌కు గట్టి సమాధానమిచ్చాడు. 

ఇక చివరి ఓవర్‌కు ఢిల్లీ సారథి రిషభ్‌ పంత్‌(Rishabh Pant).. టామ్‌ కరన్‌ను రంగంలోకి దింపాడు. అతడు వచ్చీ రాగానే మొయిన్‌ అలీని పెవిలియన్‌కు పంపినా.. ధోని(MS Dhoni) వరుస బౌండరీలు బాదడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. 3 బంతుల్లో 5 పరుగులు అవసరమైన తరుణంలో వైడ్‌ రూపంలో ఒక పరుగు రావడం, త తర్వాత ధోని బౌండరీ బాదడంతో చెన్నై సగర్వంగా తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరింది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ.. క్వాలియఫైయర్‌-2 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Rishabh Pant(PC: IPL)- Gautam Gambhir

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, ఢిల్లీ జట్టు మాజీ సారథి గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతి ముఖ్యమైన 19వ ఓవర్‌లో బంతిని కగిసో రబడ(Kagiso Rabada)కు ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ను ఆవేశ్‌ ఖాన్‌ పెవిలియన్‌కు పంపినప్పటికీ... అత్యుత్తమ డెత్‌ బౌలర్‌ రబడాతో 19వ ఓవర్‌ను వేయించాల్సింది. ఇతర ఆలోచనకు తావు లేకుండా అతడికే బౌలింగ్‌ ఇవ్వాల్సింది. 

ఆవేశ్‌​ 17, నోర్ట్జే 18, రబడ 19, టామ్‌ కరన్‌ 20.. ఈ క్రమంలో బౌలింగ్‌ ఆర్డర్‌ ఉండాల్సింది. ఆవేశ్‌తో 17, 19 ఓవర్లు వేయించడం సరైన నిర్ణయం కాదు. రబడ.. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. తను వరల్డ్‌కాస్‌ బౌలర్‌. తన సేవలను వినియోగించుకోవాల్సింది’’ అని గంభీర్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కాగా చెన్నై 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొంది ఫైనల్‌ చేరగా.. ఎలిమినేటర్‌ విజేతతో పంత్‌ సేన క్వాలిఫయర్‌-2 ఆడాల్సి ఉంటుంది.

స్కోర్లు: ఢిల్లీ క్యాపిటల్స్‌: 172/5 (20)
చెన్నై సూపర్‌కింగ్స్‌: 173/6 (19.4) 

చదవండి: Virat Kohli: సీట్లోంచి లేచి ఎగిరి గంతేశాను.. గ్రేటెస్ట్‌ ఫినిషర్‌.. ధోనిపై ప్రశంసల జల్లు

>
మరిన్ని వార్తలు