స్మిత్‌ను లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ చేశావుగా!

1 Oct, 2020 19:42 IST|Sakshi

దుబాయ్‌: ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్‌ కమిన్స్‌, స్టీవ్‌ స్మిత్‌లు ప్రత్యర్థులుగా మారారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌కు కమిన్స్‌ ప్రాతినిథ్యం వహిస్తుండగా, స్టీవ్‌ స్మిత్‌ రాజస్తాన్‌కు ఆడుతున్నారు.  కేకేఆర్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ లక్ష్య చేధనలో తడబడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌లో స్మిత్‌ తడబడి చివరకు ఔటయ్యాడు.  ఆ ఓవర్‌ను ఆడటానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ స్మిత్‌ చివరకు వికెట్‌ సమర్పించుకున్నాడు.దీనిపై ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ మాట్లాడుతూ.. కమిన్స్‌ బౌలింగ్‌ ముందు స్మిత్‌ తేలిపోయాడన్నాడు. అసలు కమిన్స్‌ బౌలింగ్‌ వేస్తుంటే ఓపెనర్‌గా వచ్చిన స్మిత్‌ వద్ద సమాధానం లేకపోయిందన్నాడు. వీరిద్దరి ప్రదర్శన గురించి తన యూట్యూబ్‌ చానల్‌ హాగ్‌ మాట్లాడాడు. (చదవండి: టాప్‌-20 ఫాస్టెస్ట్‌ బాల్స్‌.. ఒక్కడే 16)

‘ రాజస్తాన్‌ ఛేజింగ్‌కు దిగినప్పుడు రెండో ఓవర్‌లోనే గేమ్‌ మారిపోయింది. నంబర్‌ వన్‌ టెస్టు బౌలర్‌ అయిన కమిన్స్‌ బౌలింగ్‌ ముందు నంబర్‌ వన్‌ టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ తేలిపోయాడు. కమిన్స్‌ బౌలింగ్‌ వేస్తున్నప్పుడు లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయిపోయాడు. కమిన్స్‌ను ఎందుకు అత్యధిక ధర పెట్టి కేకేఆర్‌ తీసుకుందో ఇప్పుడు అర్థమై ఉంటుంది. కమిన్స్‌ బౌలింగ్‌కు స్మిత్‌ దగ్గర సమాధాన లేకుండా పోయింది. కమిన్స్‌ లేకపోతే నాగర్‌కోటి, మావిలను స్మిత్‌ సమర్ధవంతంగానే ఎదుర్కొనేవాడు. అప్పుడు రాజస్తాన్‌ మంచి పొజిషన్‌లో ఉండేది. మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చిన వికెట్‌ మాత్రం స్మిత్‌దే. కమిన్స్‌ బౌలింగ్‌కు స్మిత్‌ బ్రెయిన్‌ ఫేడ్‌ అవుట్‌ అయ్యింది’ అని హాగ్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు