CWG 2022: రికార్డు సృష్టించిన అచింత షెవులి.. భారత్‌ ఖాతాలో మూడో స్వర్ణం

1 Aug, 2022 07:14 IST|Sakshi

Achinta Sheuli: కామ‌న్వెల్డ్ గేమ్స్‌ 2022లో భారత వెయిట్‌లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఈ గేమ్స్‌ భారత్‌ ఇప్పటివరకు సాధించిన పతకాలన్నీ వెయిట్‌ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. ఈ క్రీడలో ఇప్పటికే 5 మెడల్స్‌ సాధించిన భారత్‌.. తాజాగా మరో పతకం ఖాతాలో వేసుకుంది. 73 కేజీల విభాగంలో అచింత షెవులి రికార్డు ప్రదర్శనతో పసిడి సాధించాడు.

స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జ‌ర్క్‌లో 170 కేజీల బ‌రువు ఎత్తిన షెవులి.. మొత్తంగా 313 కేజీల బ‌రువు ఎత్తి సరికొత్త కామన్‌వెల్త్‌ రికార్డు నెలకొల్పాడు. కామ‌న్వెల్త్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. 73 కేజీల ఈవెంట్‌లో మ‌లేషియాకు చెందిన ఎర్రి హిదాయత్‌ మ‌హ‌మ్మద్‌ 303 కేజీల‌ బరువు ఎత్తి రజతం సాధించగా.. కెనెడాకు చెందిన షాడ్‌ డార్సిగ్ని (298 కేజీలు) కాంస్యం దక్కించుకున్నాడు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య మొత్తం ఆరుకు చేరింది. మహిళల కేటగిరిలో మీరాబాయ్‌ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, జెరెమీ లాల్‌రిన్నుంగ 67 కేజీల విభాగంలో స్వర్ణం, 73 కేజీల విభాగంలో అచింత షెవులి స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్‌ మహదేవ్‌ సార్గర్‌ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్‌ పూజారి కాంస్య పతకం సాధించారు.
చదవండి: భారత్‌ ఖాతాలో మరో పతకం.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో జెరెమీకి గోల్డ్‌

మరిన్ని వార్తలు