CWG 2022: 16 ఏళ్ల తర్వాత మహిళల హాకీలో పతకం.. అంబరాన్ని అంటిన సంబురాలు

8 Aug, 2022 07:59 IST|Sakshi

గోల్‌కీపర్, కెప్టెన్‌ సవిత పూనియా అన్నీ తానై అడ్డుగోడలా నిలబడటంతో... 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. చివరి క్షణాల్లో చేసిన పొరపాటు వల్ల షూటౌట్‌ దాకా వెళ్లిన భారత్‌... కెప్టెన్‌ సవిత చురుకైన ప్రదర్శన వల్లే ‘షూటౌట్‌’లో 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది.

ఆట 29వ నిమిషంలో సలీమా టెటె చేసి గోల్‌తో 1–0తో ఆఖరి దాకా ఆధిక్యంలో నిలిచిన భారత్‌... ఇంకొన్ని క్షణాల్లో మ్యాచ్‌ గెలిచేందుకు సిద్ధమైపోయింది. 30 సెకన్లలో మ్యాచ్‌ ముగుస్తుందనగా... కివీస్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించగా ఒలీవియా మెర్రీ (60వ ని.) దాన్ని గోల్‌గా మలిచింది. 1–1తో సమంకాగా, షూటౌట్‌ అనివార్యమైంది. భారత బృందంలో తొలి షాట్‌లో సంగీత గురి తప్పగా... రెండు, మూడు షాట్‌లలో సోనిక, నవనీత్‌ స్కోరు చేశారు.

నాలుగో షాట్‌లో నేహా విఫలమైంది. న్యూజిలాండ్‌ జట్టులో తొలి షాట్‌ను మేగన్‌ హల్‌ మాత్రమే గోల్‌పోస్ట్‌లోకి తరలించగా... మిగతా నాలుగు షాట్‌లను రాల్ఫ్‌ హోప్, రోజ్‌ టైనన్, కేటీ డోర్, ఒలీవియా షనన్‌ల షాట్లను సవిత అడ్డుకుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల హాకీలో భారత్‌కిది మూడో పతకం. 2002 గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా 2006లో రజతం సాధించింది.   

మరిన్ని వార్తలు