CWG 2022 Day 9: అదరగొడుతున్న భారత అథ్లెట్లు.. స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్‌ సాబ్లేకు రజతం

6 Aug, 2022 18:13 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు అదరగొడుతున్నారు. తొమ్మిదో రోజు వరుసగా రెండు రజతాలతో సత్తా చాటారు. తొలుత మహిళల 10000 మీటర్ల రేస్ వాక్‌ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్‌తో బోణీ కొట్టగా.. తాజాగా పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు.  

అవినాష్‌ 8:11.20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు జాతీయ రికార్డును నెలకొల్పాడు. అవినాష్‌.. కేవలం 0.05 సెకెన్ల తేడాతో స్వర్ణాన్ని కోల్పోయాడు. కెన్యాకు చెందిన అబ్రహామ్‌ కిబివోత్‌ (8:11.15) స్వర్ణం, అదే దేశానికి చెందిన ఆమోస్‌ సెరమ్‌ (8:16.83) కాంస్య పతకాలు సాధించారు.  

కాగా, ప్రస్తుత క్రీడల ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగంలో భారత్‌ ఇదివరకే మూడు పతాకలు గెలిచింది. పురుషుల హై జంప్‌లో తేజస్విన్ యాదవ్ కాంస్యం, లాంగ్ జంప్‌లో  శ్రీశంకర్ మురళీ రజతం, మహిళల 10000 మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి రజత పతకాలు సాధించారు. అవినాష్‌ పతకంతో ఈ విభాగంలో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఓవరాల్‌గా భారత్‌ 28 మెడల్స్‌తో (9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కంస్యాలు) నాటౌట్‌గా నిలిచింది. 
చదవండి: భారత్‌ ఖాతాలో 27వ పతకం.. రేస్‌ వాక్‌లో ప్రియాంకకు రజతం

మరిన్ని వార్తలు