CWG 2022: ‘రవి అస్తమించని’ క్రీడలు

28 Jul, 2022 00:50 IST|Sakshi

నేటి నుంచి కామన్వెల్త్‌ గేమ్స్‌  

బరిలో 72 దేశాల క్రీడాకారులు

భారత్‌ నుంచి 215 మంది  

పతాకధారులగా సింధు, మన్‌ప్రీత్‌ 

20 క్రీడాంశాల్లో పోటీలు

ఆగస్టు 8 వరకు మెగా ఈవెంట్‌

అమెరికా లేకపోతేనేమి, ఆస్ట్రేలియా ఆట కనువిందు చేస్తుంది... చైనా కనిపించకపోయినా ఇంగ్లండ్‌ స్టార్ల జోరు కట్టి పడేస్తుంది... రష్యా మెరుపులకు అవకాశం లేకున్నా... కెనడా, న్యూజిలాండ్‌ ఆ లోటును తీరుస్తాయి... ఇక పెద్ద సంఖ్యలో పతకావకాశాలతో సగటు భారత క్రీడాభిమానికి పన్నెండు రోజుల పాటు సరైన వినోదం ఖాయం. ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడల సంక్షిప్త రూపమిది.

ఒకనాడు బ్రిటీష్‌ పాలనలో ఉండి, ఆపై స్వతంత్రంగా మారిన దేశాల మధ్య క్రీడా మైదానాల్లో సాగే సమరాలకు వేదిక ఈ ఆటలు... ప్రపంచ సంబరం ఒలింపిక్స్‌తో పోలిస్తే స్థాయి కాస్త తక్కువే అయినా... ఈ క్రీడలకు తమదైన ప్రత్యేకత ఉంది. వర్ధమాన ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇది సరైన చోటు కాగా... వనుతూ, మాల్టా, నౌరూ... ఇలా ప్రతీ చిన్న దేశం పతకంతో సందడి చేస్తుంటే కనిపించే క్రీడా స్ఫూర్తి, వేదికపై ఆ కళే వేరు...72 దేశాలకు చెందిన ఆటగాళ్లతో ఆగస్టు 8 వరకు జరిగే ఈ పండగలో చివరాఖరికి ఎవరెన్ని పతకాలను తమ ఖాతాలో వేసుకుంటారనేది ఆసక్తికరం. 

భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 11:30 నుంచి ప్రారంభోత్సవం జరగనుంది. సోనీ సిక్స్, సోనీ టెన్‌–1,2,3,4 చానెల్స్‌లో, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

బర్మింగ్‌హామ్‌: 2022 సంవత్సరంలో 22వ కామన్వెల్త్‌ క్రీడలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ పోటీల్లో దాదాపు ఐదువేల మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనుండగా, శుక్రవారం నుంచి పోటీలు మొదలవుతాయి. మొత్తం 20 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం పోటీ పడతారు. మహిళల క్రికెట్‌ తొలిసారి టి20 రూపంలో కామన్వెల్త్‌ క్రీడల్లో అడుగు పెట్టనుండటం విశేషం. సాధారణంగా రెండు ఒలింపిక్స్‌ మధ్య (రెండేళ్ల తర్వాత, రెండేళ్ల ముందు) వీటిని నిర్వహిస్తారు. అయితే కోవిడ్‌తో టోక్యో క్రీడలు ఆలస్యం కావడంతో సంవత్సరం లోపే ఈ మెగా ఈవెంట్‌ ముందుకు వచ్చింది. 1930లో తొలిసారి ‘బ్రిటీష్‌ ఎంపైర్‌ గేమ్స్‌’ పేరుతో నిర్వహించిన ఈ క్రీడలు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మినహా ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగాయి. 1934 (లండన్‌), 2002 (మాంచెస్టర్‌) తర్వాత ఇంగ్లండ్‌ మూడోసారి కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది.  

వేదిక మారి... 
నిజానికి ఈసారి పోటీలు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరగాలి. 2015లో ఆ ఒక్క దేశమే బిడ్‌ వేయడంతో హక్కులు కేటాయించారు. అయితే ఆర్థికపరమైన సమస్యలతో తమ వల్ల కాదంటూ 2017లో దక్షిణాఫ్రికా చేతులెత్తేయడంతో వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ క్రీడల మొత్తం బడ్జెట్‌ 778 మిలియన్‌ పౌండ్లు (రూ. 80 వేల కోట్లు). పోటీలపరంగా చూస్తే ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇన్నేళ్ల క్రీడల చరిత్రలో మొత్తం 932 స్వర్ణాలు సహా 2,415 పతకాలతో ఆసీస్‌ అగ్రస్థానంలో ఉండగా... 2,144 పతకాలతో ఇంగ్లండ్‌ (714 స్వర్ణాలు) రెండో స్థానంలో నిలిచింది. కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలూ పతకాల పట్టికలో ముందంజలో ఉండగా... జమైకా, కెన్యావంటి దేశాలు అథ్లెటిక్స్‌లో తమ ప్రభావం చూపించగలిగాయి. ఓవరాల్‌గా భారత్‌ కూడా 2002 నుంచి టాప్‌–5లో నిలబడుతూ వస్తోంది.  

ప్రాభవం కోల్పోతున్నాయా! 
22 సార్లు క్రీడల నిర్వహణ మొత్తంగా 9 దేశాలకే పరిమితమైంది. వచ్చేసారి కూడా ఆస్ట్రేలియాలోనే (విక్టోరియా రాష్ట్రం) జరగనున్నాయి. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసే స్థితిలో చాలా కామన్వెల్త్‌ దేశాలు లేవు. పైగా పోటీల స్థాయి ఒలింపిక్స్‌తో మాత్రమే కాదు, ఆసియా క్రీడలతో పోల్చి చూసినా చాలా తక్కువగా ఉంటోంది. ఒక్క అథ్లెటిక్స్‌లో మాత్రం ప్రపంచస్థాయి ప్రమాణాలు కనిపిస్తుండగా, మిగతా క్రీడాంశాల్లో ఇక్కడ నమోదయ్యే అత్యుత్తమ ప్రదర్శనలకు, ఒలింపిక్‌ ప్రదర్శనలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. వేర్వేరు కారణాలతో స్టార్‌ ఆటగాళ్లు కామన్వెల్త్‌ క్రీడలకు దూరమవుతుండటంతో ఆసక్తి ఒక్కసారిగా తగ్గిపోతోంది.

భారత్‌ కోణంలో చూస్తే ఇక్కడి ఫలితాలు ఆటగాళ్లను, అభిమానులను ‘భ్రమల్లో’ ఉంచుతున్నాయని, ఈ ఫలితం చూసి క్రీడల్లో బాగున్నామని భావించడం సరైంది కాదని పలువురు మాజీ ఆటగాళ్లు తరచుగా వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితి చూపిస్తోంది. అన్నింటికి మించి రాజకీయపరమైన కోణంలో ఈ క్రీడలపై అనాసక్తి కనిపిస్తోంది. ఒలింపిక్స్‌కు ప్రత్యామ్నాయంగా, అమెరికా ఆధిపత్యానికి ఎదురుగా నిలబడేందుకు తీసుకొచ్చి కామన్వెల్త్‌ క్రీడలు 1960ల వరకు మంచి ఫలితాలు అందించాయి. ఆ తర్వాతే వాటి స్థాయి పడిపోయింది. ఇన్నేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఇంకా బ్రిటీష్‌ పాలించిన దేశాల మధ్య పోటీ ఏమిటంటూ వచ్చే విమర్శలతో పాటు... కామన్వెల్త్‌ దేశాల మధ్య ఒక కూటమిగా ఎలాంటి రాజకీయ సారూప్యత లేదు. సభ్య దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, కీలక విధాన నిర్ణయాల మీద సహకారం అందించే విధానం, స్పష్టమైన పాత్ర లేకపోగా, అంతటి బలం కూడా వీటికి లేదు. దాంతో ఇవి నామమాత్రంగా మారిపోతున్నాయి.  

66లో 16 పోయినట్లే! 
ఈసారి కామన్వెల్త్‌ క్రీడల నుంచి షూటింగ్‌ క్రీడాంశాన్ని తొలగించడం భారత్‌కు పెద్ద దెబ్బే. 2018లో మన దేశం సాధించిన 66 పతకాల్లో 16 (అత్యధికంగా 7 స్వర్ణాలు సహా) షూటింగ్‌ ద్వారా వచ్చాయి. భారత్‌ మూడో స్థానంలో నిలవగా, ఈసారి కిందకు దిగజారే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, టేబుల్‌ టెన్నిస్‌లో మనకు ఖాయంగా మెడల్స్‌ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

భారత్‌ నుంచి ఈసారి 16 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 215 మంది క్రీడాకారులు పతకాల వేటలో ఉన్నారు. నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ పతాకధారులుగా వ్యవహరిస్తారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాను ‘ప్లాగ్‌ బేరర్‌’గా ఎంపిక చేసినా అతను గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. దాంతో 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ లో భారత బృందానికి ‘ఫ్లాగ్‌ బేరర్‌’గా వ్యవహరించిన సింధుకు మరోసారి అవకాశం వచ్చింది.

భారత్‌ @ బర్మింగ్‌హామ్‌
ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ నుంచి 16 క్రీడాంశాల్లో 215 మంది పోటీపడుతున్నారు. అథ్లెటిక్స్‌ (43), హాకీ (36), మహిళలక్రికెట్‌ (15), వెయిట్‌లిఫ్టింగ్‌ (15), సైక్లింగ్‌ (13), బాక్సింగ్‌ (12), రెజ్లింగ్‌ (12), టేబుల్‌ టెన్నిస్‌ (12), బ్యాడ్మింటన్‌ (10), లాన్‌ బౌల్స్‌ (10), స్క్వాష్‌ (9) జిమ్నాస్టిక్స్‌ (7), స్విమ్మింగ్‌ (7), జూడో (6), ట్రయాథ్లాన్‌ (4), పారా పవర్‌లిఫ్టింగ్‌ (4).

కామన్వెల్త్‌ గేమ్స్‌ షెడ్యూల్‌ 
ప్రారంభ వేడుకలు  నేడు రాత్రి గం. 11:30 నుంచి
అథ్లెటిక్స్‌: జూలై 30 నుంచి ఆగస్టు 7 
అక్వాటిక్స్‌: జూలై 29 నుంచి ఆగస్టు 8 
బ్యాడ్మింటన్‌: జూలై 29 నుంచి ఆగస్టు 8 
3గీ3 బాస్కెట్‌బాల్‌: జూలై 29 నుంచి ఆగస్టు 2 
బీచ్‌ వాలీబాల్‌: జూలై 30 నుంచి ఆగస్టు 7 
బాక్సింగ్‌: జూలై 29 నుంచి ఆగస్టు 7 
క్రికెట్‌: జూలై 29 నుంచి ఆగస్టు 7 
సైక్లింగ్‌: జూలై 29 నుంచి ఆగస్టు 7 
జిమ్నాస్టిక్స్‌: జూలై 29 నుంచి ఆగస్టు 6 
హాకీ: జూలై 29 నుంచి ఆగస్టు 8 
జూడో: ఆగస్టు 1 నుంచి 3 
లాన్‌ బౌల్స్‌: జూలై 29 నుంచి ఆగస్టు 6 
నెట్‌బాల్‌: జూలై 29 నుంచి ఆగస్టు 7 
పారా పవర్‌లిఫ్టింగ్‌: ఆగస్టు 4 
రగ్బీ సెవెన్స్‌: జూలై 29 నుంచి 31 
స్క్వాష్‌: జూలై 29 నుంచి ఆగస్టు 8 
టేబుల్‌ టెన్నిస్‌: జూలై 29 నుంచి ఆగస్టు 8 
ట్రయాథ్లాన్‌: జూలై 29 నుంచి 31 
వెయిట్‌లిఫ్టింగ్‌: జూలై 30 నుంచి ఆగస్టు 3 
రెజ్లింగ్‌: ఆగస్టు 5 నుంచి 6 
ముగింపు వేడుకలు  ఆగస్టు 8

మనోళ్లు 11 మంది...
కామన్వెల్త్‌ గేమ్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కలిపి మొత్తం 11 మంది భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జ్యోతి యెర్రాజీ, నిఖత్‌ జరీన్, ఆకుల శ్రీజ, సబ్బినేని మేఘన తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో పోటీపడుతున్నారు. 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది బరిలోకి దిగారు.  
అథ్లెటిక్స్‌: జ్యోతి యెర్రాజీ (ఆంధ్రప్రదేశ్‌; మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌) 
బ్యాడ్మింటన్‌: సింధు, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌), సుమీత్‌ రెడ్డి, గాయత్రి గోపీచంద్‌ (తెలంగాణ). 
బాక్సింగ్‌: నిఖత్‌ జరీన్‌ (తెలంగాణ; మహిళల 50 కేజీలు), హుసాముద్దీన్‌ (తెలంగాణ; పురుషుల 57 కేజీలు). 
మహిళల హాకీ: రజని ఇటిమరపు (ఆంధ్రప్రదేశ్‌; రెండో గోల్‌కీపర్‌) 
టేబుల్‌ టెన్నిస్‌: ఆకుల శ్రీజ (తెలంగాణ) 
మహిళల టి20 క్రికెట్‌: సబ్బినేని మేఘన (ఆంధ్రప్రదేశ్‌) 

మరిన్ని వార్తలు