CWG 2022: బాల్‌రాజ్‌ ఏంటిది? చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న ఆటగాళ్లు.. ఇంత చెత్తగా..

5 Aug, 2022 15:38 IST|Sakshi
కొట్టుకుంటున్న హాకీ ఆటగాళ్లు(PC: Twitter)

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పోటీ పడుతున్నామనే విషయం మరిచి ఇద్దరు హాకీ ఆటగాళ్లు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకున్నారు. సహచర ఆటగాళ్లు వచ్చి వారిని విడదీయకపోతే అలాగే కొట్టుకునేవాళ్లేమో! ఇంతకీ ఏం జరిగిందంటే..

సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌... గురువారం కెనడాతో తలపడింది. పూల్‌ బీలో జరిగిన ఈ మ్యాచ్‌లో హాఫ్‌టైమ్‌ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు కెనడా ప్లేయర్‌ బాల్‌రాజ్‌ పనేసర్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు క్రిస్‌ గ్రిఫిత్స్‌ మధ్య వివాదం తలెత్తింది. అప్పటికే ఇంగ్లండ్‌ 4-1తో ఆధిక్యంలో ఉంది. ఆట కొనసాగుతుండగా గ్రిఫిత్స్‌ బంతిని తీసుకునే ప్రయత్నం చేయగా.. పనేసర్‌ అడ్డుకున్నాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం.. ఒకరినొకరు చొక్కాలు పట్టుకునే స్థాయికి వెళ్లింది. ఒకానొక సమయంలో పనేసర్.. గ్రిఫిత్స్‌ గొంతు కూడా పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. దీంతో సహచర ఆటగాళ్లు వచ్చి ఇద్దరినీ విడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హాకీలో రెజ్లింగ్‌.. ఒ​కే టికెట్‌పై రెండు ఆటలు అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇక ఈ ఘటనలో బాల్‌రాజ్‌కు అంపైర్‌ రెడ్‌ కార్డ్‌ చూపడంతో మైదానాన్ని వీడగా.. గ్రిఫిత్స్‌కు యెల్డో కార్డ్‌ జారీ అయింది. మ్యాచ్‌ విషయానికొస్తే.. 11-2తో కెనడాను ఓడించిన ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరింది. ఆస్ట్రేలియాతో సెమీస్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. భారత్‌ సైతం వేల్స్‌పై 4-1తో గెలుపొంది సెమీ ఫైనల్‌ చేరుకుంది. వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో రాణించడంతో అద్భుత విజయం అందుకుంది.

చదవండి: WC 2022: ఓపెనర్‌గా పంత్‌, ఇషాన్‌.. సూర్య కాదు! అతడే సరైనోడు! జట్టులో చోటే లేదే!
SreeShankar Won Silver CWG 2022: మేజర్‌ సర్జరీ.. లాంగ్‌ జంప్‌ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్‌?

మరిన్ని వార్తలు