Birmingham 2022: శెభాష్‌ రేణుక! అద్భుతమైన ఇన్‌స్వింగర్‌.. బిత్తరపోయిన ఆసీస్‌ బ్యాటర్‌!

30 Jul, 2022 13:05 IST|Sakshi
అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మెగ్రాత్‌ను బౌల్డ్‌ చేసిన రేణుక(PC: Olympic Khel)

కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత జట్టును ఆదిలోనే ఓటమి పలకరించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన పరాజయం పాలైంది. మూడు వికెట్ల తేడాతో ఆసీస్‌ చేతిలో ఓటమి మూటగట్టుకుంది.

గెలుపు కోసం భారత మహిళా జట్టు ఆఖరి వరకు పోరాడినా.. ఆష్లే గార్డ్‌నర్‌ 52 పరుగులతో అజేయంగా నిలిచి హర్మన్‌ప్రీత్‌ బృందం ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో తొలి మ్యాచ్‌లోనే గెలిచి అరుదైన ఘనత సాధించాలనుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. 

కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడినా.. బౌలర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌ అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఆమె కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చింది. రేణుక ధాటికి ఆసీస్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

మ్యాచ్‌ రెండో బంతికే ఓపెనర్‌ అలిసా హేలీను అవుట్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించిన రేణుక.. వరుసగా బెత్‌ మూనీతో పాటు.. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌, తాహిలా మెగ్రాత్‌ వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా ఐదో ఓవర్‌ మొదటి బంతికి మెగ్రాత్‌ను రేణుక అవుట్‌ చేసిన తీరు హైలెట్‌గా నిలిచింది.

అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మెగ్రాత్‌ను రేణుక బౌల్డ్‌ చేసింది. రేణుక సంధించిన బంతిని షాట్‌ ఆడేందుకు మెగ్రాత్‌ సమాయత్తమైంది. కానీ.. నమ్మశక్యం కాని రీతిలో బంతి మెగ్రాత్‌ ప్యాడ్‌, బ్యాట్‌ మధ్య నుంచి దూసుకెళ్లి స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో బిత్తరపోయిన మెగ్రాత్‌ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిరాశగా క్రీజును వీడింది. అయితే, గార్డ్‌నర్‌కు తోడు గ్రేస్‌ హ్యారిస్‌ 37 పరుగులతో రాణించడంతో విజయం ఆసీస్‌ సొంతమైంది.

కామన్వెల్త్‌ క్రీడలు 2022- మహిళా క్రికెట్‌(టీ20 ఫార్మాట్‌)
►భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా
►వేదిక: ఎడ్జ్‌బాస్టన్‌, బర్మింగ్‌హామ్‌
►టాస్‌: భారత్‌- బ్యాటింగ్‌
►భారత్‌ స్కోరు: 154/8 (20)
►ఆస్ట్రేలియా స్కోరు: 157/7 (19)
►విజేత: ఆస్ట్రేలియా... 3 వికెట్ల తేడాతో గెలుపు
చదవండి: Ind Vs WI T20 Series: మొన్న పంత్‌.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు! అయినా..
Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం

మరిన్ని వార్తలు