Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్‌ గురి.. అసలు లాన్‌ బౌల్స్‌ అంటే ఏమిటి?

2 Aug, 2022 08:24 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: లాన్‌ బౌల్స్‌... కామన్వెల్త్‌ క్రీడలు ప్రారంభమైన నాటినుంచి ఒక్కసారి మినహా ప్రతీసారి ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉంది. 2010 నుంచి మాత్రమే పాల్గొంటున్న భారత్‌ అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు మన మహిళలు కొత్త చరిత్రను సృష్టించారు. లాన్‌ బౌల్స్‌ ‘ఫోర్స్‌’ ఫార్మాట్‌లో ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేశారు. లవ్లీ చౌబే, రూపా రాణి టిర్కీ, పింకీ, నయన్‌మోని సైకియా సభ్యులుగా ఉన్న భారత బృందం సెమీఫైనల్లో 16–13 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో విజయం సాధిస్తే భారత్‌కు స్వర్ణ పతకం దక్కుతుంది. ఓడితే రజతం లభిస్తుంది. భారత పురుషుల జట్టు మాత్రం 8–26 తేడాతో నార్తర్న్‌ ఐర్లాండ్‌ చేతిలో ఓడి క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది.  

‘లాన్‌ బౌల్స్‌’ ఎలా ఆడతారంటే... 
సింగిల్స్, డబుల్స్‌లతో పాటు టీమ్‌లో నలుగురు ఉండే ‘ఫోర్స్‌’ ఫార్మాట్‌లు ఇందులో ఉన్నాయి. పచ్చిక మైదానంలో ఆడే ఈ ఆటలో ‘బౌల్స్‌’గా పిలిచే రెండు పెద్ద సైజు బంతులతో పాటు ‘ది జాక్‌’ అని చిన్న బంతి కూడా ఉంటుంది. టాస్‌ వేసి ముందుగా ఎవరు బౌల్‌ చేస్తారో, ఎవరు జాక్‌ను విసురుతారో తేలుస్తారు. ముందుగా ఒకరు ‘జాక్‌’ను అండర్‌ ఆర్మ్‌ త్రో తో విసురుతారు. ఆపై మరో జట్టు సభ్యులకు బౌల్స్‌ విసిరే అవకాశం లభిస్తుంది.

‘ఫోర్స్‌’ ఫార్మాట్‌లో ఒక్కో జట్టు ఒక్కో రౌండ్‌ (ఎండ్‌)లో ఎనిమిది త్రోలు విసరవచ్చు. ఇలా 18 రౌండ్‌లు ఉంటాయి. ‘జాక్‌’కు సాధ్యమైనంత దగ్గరగా బౌల్‌ చేయడమే ఫలితాన్ని నిర్దేసిస్తుంది. ప్రత్యర్థికంటే ఎన్ని తక్కువ ప్రయత్నాల్లో జాక్‌కు దగ్గరగా బౌల్‌ చేయగలరో అన్ని పాయింట్లు జట్టు ఖాతాలో చేరతాయి. చివర్లో ఈ పాయింట్లను లెక్కకట్టి విజేతను నిర్ణయిస్తారు. 

చదవండి: Commonwealth Games 2022: సుశీలకు చేజారిన స్వర్ణం

>
మరిన్ని వార్తలు