CWG 2022: పట్టు వదలని భారత మహిళా హాకీ జట్టు.. సెమీస్‌లో రిఫరీ దెబ్బకొట్టినా కాంస్యం సొంతం

7 Aug, 2022 16:10 IST|Sakshi

CWG 2022: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల వేటలో దూసుకుపోతుంది. తొమ్మిదో రోజు వరకు మొత్తం 40 పతాకలు (13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు) సాధించిన భారత్‌.. పదో రోజు ఆరంభంలోనే రెండు స్వర్ణాలు, మరో కాంస్యం సాధించి పతకాల సంఖ్యను 43కు పెంచుకుంది. మహిళల బాక్సింగ్‌ 48 కేజీల మినిమమ్‌ వెయిట్‌ విభాగంలో నీతూ గంగాస్‌, పురుషుల బాక్సింగ్‌ 51 కేజీల విభాగంలో అమిత్‌ పంగాల్‌ పసిడి పంచ్‌ విసరగా.. మహిళల హాకీలో భారత్‌ కాంస్యం చేజిక్కించుకుంది.

సెమీస్‌లో (ఆస్ట్రేలియా) అంపైర్‌ తప్పిదం కారణంగా స్వర్ణం లేదా రజతం గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన భారత మహిళా హాకీ జట్టు.. కాంస్య పతక పోరులో అసమాన పోరాట పటిమ కనబర్చి పెనాల్టీ షూటౌట్‌లో న్యూజిలాండ్‌పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది. మ్యాచ్‌ కొద్ది సెకెన్లలో (18 సెకెన్లలో) ముగుస్తుందనగా న్యూజిలాండ్‌ గోల్‌ చేసి 1-1తో స్కోర్‌ను సమం చేయడంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ తరఫున సోనికా, నవ్‌నీత్‌ కౌర్‌ గోల్స్‌ సాధించగా.. కివీస్‌ తరఫున మెగాన్‌ హల్‌ మాత్రమే గోల్‌ చేయగలిగింది. 
చదవండి: Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు
 

మరిన్ని వార్తలు