CWG 2022 Day 9: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్‌.. లాన్‌బౌల్స్‌లో మరో పతకం

6 Aug, 2022 20:19 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించి, స్వదేశంలో అంతగా ఆదరణ లేని క్రీడల్లో సైతం పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌  అథ్లెటిక్స్‌ (4 పతకాలు), లాన్‌బౌల్స్‌ (1), జూడో (3), స్క్వాష్‌ (1) వంటి క్రీడల్లో ఇప్పటికే 8 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా లాన్‌బౌల్స్‌లో మరో పతకం సాధించారు.

పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో సునీల్‌ బహదూర్‌, నవ్‌నీత్‌ సింగ్‌, చందన్‌ కుమార్‌ సింగ్‌, దినేశ్‌ కుమార్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్‌లో నార్త్రన్‌ ఐర్లాండ్‌ చేతిలో 5-18 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకుంది. తద్వారా లాన్‌బౌల్స్‌లో రెండో మెడల్‌, ఓవరాల్‌గా 29వ మెడల్‌ (9 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలు) భారత్‌ ఖాతాలో చేరాయి. 

మహిళల లాన్‌బౌల్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ ఇదివరకే స్వర్ణం నెగ్గి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  లవ్లీ చౌబే, పింకి, నయన్మోని సైకియా, రూపా రాణితో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికా టీమ్‌పై 17-10 తేడాతో విజయం సాధించి స్వర్ణం సాధించింది. కాగా, కామన్‌వెల్త్‌ క్రీడల తొమ్మిదో రోజు (రాత్రి 7 గంటల వరకు) భారత్‌ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి.

అథ్లెటిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగంలో రెండు, లాన్‌బౌల్స్‌లో ఓ పతకాన్ని భారత్‌ సొంతం చేసుకుంది. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్‌ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్‌తో బోణీ కొట్టగా.. ఆతర్వాత పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. తాజాగా పురుషుల లాన్‌బౌల్స్‌ టీమ్‌ కూడా రజతం సాధించింది. భారత్‌ ఇవాళ సాధించిన మూడు పతకాలు రజతాలే కావడం విశేషం. 
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్‌లో తొలి పతకం ఖరారు
 

మరిన్ని వార్తలు