Wasim Jaffer CWG 2022: 'అంచనాలకు మించి.. అదే చేత్తో కోహినూర్‌ వజ్రాన్ని' 

7 Aug, 2022 12:38 IST|Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో భారత క్రీడాకారులు అంచనాలు మించి రాణిస్తున్నారు. ఇంతకముందు మనకు ఎన్నడూ రాని విభాగాల్లోనూ పతకాలు కొల్లగొడుతున్న ఆటగాళ్లు.. అచ్చొచ్చిన క్రీడల్లో స్వర్ణ పతకాలతో చెలరేగుతున్నారు. తొమ్మిది రోజులు ముగిసేసరికి భారత్‌ ఖాతాలో 40 పతకాలు ఉండగా.. అందులో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి.


కాగా ఇందులో 22 పతకాలు కేవలం రెండు క్రీడల్లోనే రావడం విశేషం. రెజ్లింగ్‌లో 12 పతకాలు రాగా.. వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో 10 పతకాలు వచ్చి చేరాయి. ఇంకో విశేషమేమిటంటే.. రెజ్లింగ్‌ విభాగంలో మనవాళ్లు 12 మంది పోటీ పడితే.. 12 మంది పతకాలు తేవడం విశేషం. అందులో భజరంగ్‌ పూనియా, రవి దహియా, వినేష్‌ పొగాట్‌, దీపక్‌ పూనియాలు స్వర్ణాలు గెలిచారు. ఇక పదోరోజు కూడా భారత్‌ ఖాతాలో దండిగానే పతకాలు వచ్చి చేరనున్నాయి. మరి సోమవారంతో ముగియనున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఎన్ని పతకాలు కొల్లగొడుతుందనేది వేచి చూడాలి.

కాగా కామన్‌వెల్త్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పతకాల కోసం పోటీ పడడం ఆనందాన్ని కలిగిస్తుందంటూ కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ చేసిన ఒక ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ''కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అంచనాలకు మంచి రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. అదే చేత్తో బ్రిటీష్‌ వాళ్లు పట్టుకెళ్లిన మన కోహినూర్‌ వజ్రాన్ని కూడా తీసుకురండి'' అంటూ కామెంట్‌ చేశాడు. 

కామన్‌వెల్త్‌ గేమ్స్‌తో పాటు వెస్టిండీస్‌ గడ్డపై రోహిత్‌ సేన టి20 సిరీస్‌ గెలవడంపై కూడా జాఫర్‌ ట్వీట్‌ చేశాడు.''విదేశీ గడ్డపై మరో సిరీస్‌ గెలిచినందుకు రోహిత్‌ సేనకు కంగ్రాట్స్‌. జట్టులో ఆటగాళ్లందరు ఒకరినొకరు సహకరించుకుంటూ బ్యాట్‌, బంతితో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. వెల్‌డన్‌'' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక టీమిండియా ఇవాళ విండీస్‌తో చివరి టి20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను విజయంతో ముగించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది.

చదవండి: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్‌, ఆస్ట్రేలియా

CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్‌ పటేల్‌

మరిన్ని వార్తలు