Mirabai Chanu: ‘పుత్రికోత్సాహం’తో పొంగిపోయిన మీరాబాయి తల్లి! వీడియో వైరల్‌

1 Aug, 2022 11:17 IST|Sakshi
స్వర్ణ పతకంతో మీరాబాయి చాను- ఇంట్లో సంబరాలు(PC: Saikhom Mirabai Chanu Twitter)

Birmingham 2022- Mirabai Chanu: భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను తల్లి టాంబీ దేవి ‘పుత్రికోత్సాహం’తో పొంగిపోయారు. బంధువులతో కలిసి తమ సంప్రదాయ శైలిలో నాట్యం చేస్తూ కూతురి విజయాన్ని ఆస్వాదించారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో భాగంగా మీరాబాయి భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన సంగతి తెలిసిందే. 

వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగం ఫైనల్‌లో మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 113 కేజీలు (మొత్తంగా 201 కేజీలు) ఎత్తి.. పసిడి పతకం గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఆమె.. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో స్వర్ణం గెలిచి సత్తా చాటింది.

తద్వారా బర్మింగ్‌హామ్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి.. జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ క్రమంలో యావత్‌ భారతావనితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా సంతోషంలో మునిగిపోయారు. ఇక మీరాబాయి చాను తల్లి టాంబీ దేవి తమ ఇంట్లోనే సంబరాలు జరుపుకొన్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను మీరాబాయి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘‘మా అమ్మ.. ఇంకా బంధువులు.. నా విజయాన్ని ఇంట్లో ఇలా సెలబ్రేట్‌ చేసుకున్నారు’’ అంటూ ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. ఈ వీడియోను రీషేర్‌ చేస్తూ నెటిజన్లు మీరాబాయికి, ఆమె తల్లికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మీరాబాయి 2014 గ్లాస్కో గేమ్స్‌లో రజతం.. 2018 గోల్డ్‌ కోస్ట్‌ గేమ్స్‌లో స్వర్ణం, టో​క్యో ఒలింపిక్స్‌లో రజతం.. తాజాగా స్వర్ణం సాధించింది.

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి..
మణిపూర్‌కు చెందిన మీరాబాయి చానుది మధ్యతరగతి కుటుంబం. కుటుంబ సభ్యులతో కలిసి వంట కలప కోసం వెళ్లినపుడు తన అన్న కంటే ఎక్కువ బరువుల్ని మోసిన మీరాబాయి.. అప్పుడే తనలోని ప్రతిభను వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో ఆమెను ప్రోత్సహించిన కుటుంబం.. అంచెలంచెలుగా ఎదగడంలో అండగా నిలిచింది. 


తల్లితో మీరాబాయి చాను

ఇక పదకొండేళ్ల వయసులోనే స్థానికంగా జరిగే వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన చాను.. 2014 గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో వెండి పతకం సాధించి వెలుగులోకి వచ్చింది.

ఇక 2016లో రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా... పడిలేచిన కెరటంలా 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచింది. ఇవేకాకుండా ఎన్నో అరదైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. మీరాబాయి ప్రయాణంలో కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా ఆమె తల్లి ప్రోత్సాహం ఎంతగానో ఉంది.

చదవండి: Mirabai Chanu: మన 'బంగారు' మీరాబాయి
CWG 2022: మీరాబాయి ఇచ్చిన బూట్లతో బరిలోకి దిగి.. రజతంతో

మరిన్ని వార్తలు