CWG 2022: వైరల్‌గా మారిన నిఖత్‌ జరీన్‌ చర్య.. ఏం జరిగింది?

4 Aug, 2022 11:08 IST|Sakshi

భారత మహిళా బాక్సర్‌.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌ జరీన్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో కనీస కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మహిళల బాక్సింగ్‌ 50 కేజీల లైట్‌ ఫ్లైవెయిట్‌ విభాగంలో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ బౌట్‌లో 5–0తో హెలెన్‌ జోన్స్‌ (వేల్స్‌)పై గెలిచి సెమీస్‌కు ప్రవేశించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ గెలిచిన అనంతరం నిఖత్‌ జరీన్‌ చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. బుధవారం నిఖత్‌ జరీన్‌ తల్లి పర్వీన్‌ సుల్తానా పుట్టినరోజు. తల్లి పుట్టినరోజు నాడే క్వార్టర్స్‌ మ్యాచ్‌ గెలిచి కనీసం కాంస్య పతకం ఖరారు చేయడంతో నిఖత్‌ మొహం సంతోషంతో వెలిగిపోయింది. రింగ్‌ నుంచి కిందకు దిగగానే.. ''హ్యాపీ బర్త్‌డే అమ్మీ.. ఐ లవ్‌ యూ.. అల్లా నిన్ను సంతోషంగా ఉంచాలి'' అంటూ గట్టిగా అరిచింది. ఈ విజయాన్ని పర్వీనా సుల్తానాకు అంకితం చేసిన నిఖత్‌ జరీన్‌ తన తల్లిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించింది.

ఇక నిఖత్‌ జరీన్‌తో పాటు మరో తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌(57 కేజీలు) కూడా సెమీస్‌లోకి ప్రవేశించాడు. వీరితో పాటు హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్స్‌లో నికోల్‌ క్లయిడ్‌ (నార్తర్న్‌ ఐర్లాండ్‌)ను ఓడించింది. అయితే కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన లవ్లీనా బొర్హంగైన్‌ మాత్రం నిరాశపరిచింది. మిడిల్‌ వెయిట్‌ క్వార్టర్‌ఫైనల్లో వేల్స్‌కు చెందిన రోసీ ఎక్లెస్‌ చేతిలో 3-2తో ఓడిపోయింది. మరో బాక్సర్‌ ఆశిష్‌ కుమార్‌(80 కేజీలు) ఇంగ్లండ్‌కు చెందిన ఆరోన్‌ బోవెన్‌ చేతిలో 4-1తో ఓడి క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు.

చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు

Suryakumar Yadav: 'సూర్యుడి'లా వెలిగిపోతున్నాడు.. ఆపడం కష్టమే

>
మరిన్ని వార్తలు