CWG 2022: బాక్సింగ్‌లో స్వర్ణం సాధించిన తెలంగాణ బిడ్డ.. అభినందనలతో ముంచెత్తిన కేసీఆర్‌

7 Aug, 2022 19:56 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ ఒక్క రోజే భారత బాక్సర్లు మూడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 48 కేజీల మినిమమ్‌ వెయిట్‌ విభాగంలో నీతూ గంగాస్‌ స్వర్ణంతో బోణీ కొట్టగా, ఆతర్వాత నిమిషాల వ్యవధిలోనే పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్‌ పంగాల్‌ పసిడి పంచ్‌ విసిరాడు. తాజాగా మహిళల 48-50 కేజీల లైట్‌ ఫ్లై విభాగంలో తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ మరో స్వర్ణం సాధించింది.

ఫైనల్లో జరీన్‌.. నార్త్రన్‌ ఐర్లాండ్‌ బాక్సర్‌ కార్లీ మెక్‌నౌల్‌ను 5-0 తేడాతో మట్టికరిపించి, భారత్‌కు మూడో బాక్సింగ్‌ స్వర్ణాన్ని అందించింది. జరీన్‌ పసిడి పంచ్‌తో బాక్సింగ్‌లో భారత్‌ పతకాల సంఖ్య 5కు (3 స్వర్ణాలు, 2 కాంస్యాలు) చేరగా, ఓవరాల్‌గా  భారత పతకాల సంఖ్య 48కి (17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. పురుషుల ఫెదర్‌వెయిట్‌ 57 కేజీల విభాగంలో మహ్మద్‌ హుస్సాముద్దీన్‌, పురుషుల 67 కేజీల వెల్టర్‌వెయిట్‌ విభాగంలో రోహిత్‌ టోకాస్‌లు ఇదివరకే కాంస్య పతకాలు గెలిచారు. కాగా, జరీన్‌.. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.  

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణం గెలవడం పట్ల ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురు నిఖత్‌ను అభినందనలతో ముంచెత్తారు. నిఖత్‌.. భారత్‌కు గర్వకారణమని, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని.. నిఖత్‌ గెలుపుతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమైంది, నిఖత్‌.. తన విజయపరంపరను కొనసాగించాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.  
చదవండి: జావెలిన్‌ త్రోలో తొలి పతకం.. చరిత్ర సృష్టించిన అన్నూ మాలిక్‌

మరిన్ని వార్తలు