CWG 2022: వెయిట్‌లిఫ్టింగ్‌కు పర్యాయపదం ‘ఒపెలాజ్‌ ఫ్యామిలీ’

5 Aug, 2022 06:52 IST|Sakshi

పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌ 96 కేజీల విభాగంలో ‘సమోవా’ దేశానికి చెందిన డాన్‌ ఒపెలాజ్‌ మంగళవారం స్వర్ణ పతకం గెలుచుకున్నాడు... అయితే 24 గంటలు తిరగక మందే ఒపెలాజ్‌ కుటుంబంలో మరో పతకం వచ్చి చేరింది. బుధవారం 109 కేజీల కేటగిరీలో డాన్‌ సోదరుడు జాక్‌ ఒపెలాజ్‌ రజతం సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడల పతకాలతో ఈ కుటుంబ అనుబంధం చాలా పాతదే. సరిగ్గా చెప్పా లంటే ఆ దేశంలో వెయిట్‌లిఫ్టింగ్‌కు పర్యాయపదం ‘ఒపెలాజ్‌ ఫ్యామిలీ’.

12 మంది సభ్యుల కుటుంబంలో 10 మంది అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్లే కావడం విశేషం. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ క్రీడల్లో డాన్‌ సోదరు డు న్యూసిలా ఒపెలాజ్‌ స్వర్ణం గెలుచుకోగా (105 కేజీలు), అదే రోజు అతని సోదరి ఎలె ఒపెలాజ్‌ కూడా 75 కేజీల కేటగిరీలో పసిడి సొంతం చేసుకుంది. న్యూసెలా 2002 మాంచెస్టర్‌ క్రీడల్లోనూ కాంస్యం సాధించగా, 2014లో ఎలె ఖాతాలో రజతం చేరింది. మరో సోదరి మేరీ ఒపెలాజ్‌ 2014 గ్లాస్గో క్రీడల్లో రజత పతకం అందుకుంది.

గత గోల్డ్‌ కోస్ట్‌ క్రీడల్లోనూ డాన్‌ ఒపెలాజ్‌ రజతం సాధించగా... అందరికంటే చిన్నవాడు జాక్‌ పతకం సాధించడంతో ఈ కుటుంబం కామన్వెల్త్‌ క్రీడల్లో గెలుచుకున్న పతకాల సంఖ్య ‘8’కు చేరింది. పసిఫిక్‌ మహా సముద్రంలో దాదాపు 2 లక్షల జనాభా ఉండే సమోవా ఒలింపిక్స్‌లో సాధించిన ఏకైక పతకం కూడా ఎ లె ఒపెలాజ్‌దే కావడం విశేషం. 2008 బీజింగ్‌ క్రీడల్లో 75+ కేజీల కేటగిరీలో ఎలె రజతం గెలుచుకుంది.    

మరిన్ని వార్తలు