CWG 2022- PV Sindhu: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. ‘పసిడి’కి అడుగు దూరంలో..

7 Aug, 2022 15:22 IST|Sakshi

CWG 2022- PV Sindhu Enters Final: కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. సెమీస్‌లో సింగపూర్‌ షట్లర్‌ ఇయో జియా మిన్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. కాగా క్వార్టర్‌ ఫైనల్లో సింధు మలేషియా షట్లర్‌ గో వె జిన్‌ను 19-21, 21-14, 21-18తో ఓడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్‌ వేదికగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు జియాతో సెమీస్‌లో పోటీపడింది.

గాయం వేధిస్తున్నా.. హోరాహోరీగా సాగిన పోరులో సింధు ఆఖరికి పైచేయి సాధించింది. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా తన అనుభవంతో ఒత్తిడిని జయించి పీవీ సింధు 21-19, 21-17తో గెలుపు నమోదు చేసింది. తద్వారా ఈ భారత షట్లర్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 ఫైనల్లో ప్రవేశించింది. కాగా సింధు ఈ ఫీట్‌ నమోదు చేయడం వరుసగా ఇది రెండోసారి.

అంతేకాదు.. తాజా ప్రదర్శనతో ఆమె ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో వరుసగా మూడో పతకాన్ని ఖాయం చేసుకుంది. కాగా 2018 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సింధు రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా 2014లో కాంస్య పతకం అందుకుంది. ఇక ఇప్పుడు స్వర్ణ పతకానికి గురిపెట్టింది పూసర్ల వెంకట సింధు.

ఈ క్రమంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లే ట్విటర్‌ వేదికగా సింధును అభినందించాడు. భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారంటూ పీవీ సింధుతో పాటు కాంస్యం గెలిచిన జట్టులో భాగమైన హాకీ ప్లేయర్‌ సవితా పునియా, స్వర్ణం గెలిచిన బాక్సర్‌ నీతూ ఘంగస్‌ను కొనియాడాడు. ఈ మేరకు భారత మహిళా అథ్లెట్లు దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారని ప్రశంసించాడు.

చదవండి: Rohit Sharma: ఎనిమిదింటికి ఎనిమిది గెలిచేశాడు.. 5 క్లీన్‌స్వీప్‌లు.. నువ్వు తోపు కెప్టెన్‌!
CWG 2022: భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నీతు!

మరిన్ని వార్తలు