CWG 2022 Day 10: అంచనాలకు మించి రాణిస్తున్న భారత అథ్లెట్లు.. రేస్‌ వాక్‌లో మరో పతకం

7 Aug, 2022 18:24 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే  ఓ స్వర్ణం (పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఈవెంట్‌లో ఎల్దోస్‌ పాల్‌), 4 రజతాలు (మెన్స్‌ లాంగ్‌ జంప్‌లో మురళీ శ్రీశంకర్‌, మహిళల రేస్‌ వాక్‌లో ప్రియాంక గోస్వామి, పురుషుల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్‌సాబ్లే, పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఈవెంట్‌లో అబ్దుల్లా అబూబకర్), ఓ కాంస్యం (పురుషుల హై జంప్‌లో తేజస్విన్‌ శంకర్‌) సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా మరో పతకం చేజిక్కించుకున్నారు. 

పురుషుల 10000 మీటర్ల రేస్‌ వాక్ ఫైనల్స్‌లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్యం గెలిచాడు. ఈ రేస్‌ని 38:49.21 నిమిషాల్లో ముగించిన సందీప్.. మూడో స్థానంలో నిలువగా, కెనడాకు చెందిన ఎవాన్‌ డన్ఫీ (38:36.37 నిమిషాల్లో) స్వర్ణం, ఆస్ట్రేలియాకు చెందిన డెక్లాన్‌ టింగే (38:42.33 నిమిషాల్లో) రజతం సాధించారు. ఈ ఎడిషన్‌లో రేస్‌ వాక్‌లో భారత్‌కి ఇది రెండో మెడల్. మహిళల 10 కిలో మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్‌ సాధించింది. సందీప్‌ బ్రాంజ్‌తో ప్రస్తుత క్రీడల అథ్లెటిక్స్‌ విభాగంలో భారత పతకాల సంఖ్య 7కు, ఓవరాల్‌గా భారత పతకాల సంఖ్య 46కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 18 కాంస్యాలు) చేరింది. 

ఇదిలా ఉంటే, కామన్‌వెల్త్‌ క్రీడల పదో రోజు భారత్‌ పతకాల సంఖ్య ఆరుకు (3 స్వర్ణాలు, రజతం, 2 కాంస్యాలు)చేరింది. మహిళల 48 కేజీల మినిమమ్‌ వెయిట్‌ విభాగంలో నీతూ గంగాస్‌, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్‌ పంగాల్‌, ట్రిపుల్‌ జంప్‌లో ఎల్దోస్‌ పాల్‌ పసిడి పతకాలు సాధించగా.. పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఈవెంట్‌లో అబ్దుల్లా అబూబకర్ రజతం, మహిళల హాకీలో కాంస్యం, తాజాగా సందీప్‌ కుమార్‌ పురుషుల 10000 మీటర్ల రేస్‌ వాక్‌లో కాంస్యం గెలిచారు.
చదవండి: చరిత్ర సృష్టంచిన భారత అథ్లెట్లు.. ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణం, రజతం మనవే

మరిన్ని వార్తలు